4 August, 2026 | 4:59 AM

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయండి

04-08-2026 01:52 AM

కరపత్రాలు విడుదల చేసిన ఆదివాసీలు

ఆదిలాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వేట్టి మనోజ్ కోరారు. సోమవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివాసీ దినోత్సవ కరపత్రాలు విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు, ఆర్ఓఎఫ్ ఆర్ ఆటవీ భూమి చట్టాలను తుంగలోకి తొక్కుతూ ఏజెన్సీలో ఆదివాసి అడవుల విధ్వంసానికి పూనుకొని అడవి బిడ్డలకు అడవిలో నిలువ, నీడ లేకుండా చేస్తూవస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు మూలంగా 5వ షెడ్యూల్ ఏజెన్సీలో ఆదివాసీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల 9 తెగలకి చెందిన కోయ, గొండ్, నాయక్పాడ్, కొలం(మన్నేవార్), అంద్, బిల్, తోటి, పర్దాన్లు వారి సంస్కృతి కళారూపాలు, నృత్యాలతో ప్రతి గూడెంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం ప్రతి ఏడాది నిర్వహించుకుంటు వస్తున్నారన్నారు.

జిల్లాలో ఈ నెల 9న కొమురం భీం కాలనీ, న్యూహౌసింగ్ బోర్డు నుంచి రెవెన్యూ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించి కొమురం బీమ్ చౌరస్తాలో బీమ్ కి నివాళులు అర్పించిన అనంతరం రెవెన్యూ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సభ స్థలం వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి అర్క శేషారావు, ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సలాం వరుణ్, అదిలాబాద్ డివిజన్ అధ్యక్షుడు అత్రం గణపతి, సోయం సురజ్, రాయసిడం పాండురంగ్, మడావి సుబమ్, పేందుర్ శంభు, బందుకే బలిరాం తదితరులు పాల్గొన్నారు.