18 April, 2026 | 6:13 AM

ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్

18-04-2026 01:43 AM

హుస్నాబాద్, ఏప్రిల్ 17: హుస్నాబాద్ పట్టణంలోని ప్రముఖ ఎల్లమ్మ చెరువు సుందరీకరణతో పాటు కొనసాగుతున్న అభివృద్ధి పనులను అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్ శుక్రవారం రోజున పరిశీలించారు.

చెరువు పరిసరాలను అందంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న పనుల పురోగతిని సమీక్షించి, పనులు నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. చెరువు ప్రాంతాన్ని ప్రజలకు ఆహ్లాదకర వాతావరణంగా మార్చే దిశగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పట్టణ సౌందర్యాన్ని మరింత పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. చెరువు చుట్టూ పర్యావరణహిత వాతావరణం, వాకింగ్ ట్రాక్లు, పచ్చదనం, ప్రజలకు విశ్రాంతి కలిగించే సౌకర్యాలు కల్పించే అంశాలపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్  దండి లక్ష్మి మాట్లాడుతూ, ఎల్లమ్మ చెరువు అభివృద్ధితో హుస్నాబాద్ పట్టణానికి కొత్త అందం చేకూరుతుందని తెలిపారు. పట్టణ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పర్యటనలో మున్సిపల్ కమిషనర్ టి. మల్లికార్జున్, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, వార్డ్ కౌన్సిలర్ భూక్యా సంపత్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు పనుల వివరాలను అడిషనల్ కలెక్టర్కు తెలియజేశారు. ఎల్లమ్మ చెరువు అభివృద్ధి పూర్తయిన అనంతరం పట్టణ ప్రజలకు ఇది ప్రత్యేక ఆకర్షణగా మారనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.