21 June, 2026 | 1:10 AM

వనజ మృతిపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆరా

21-06-2026 12:27 AM

ప్రోగ్రాం అధికారులతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 20 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న కుంజ వనజ మృతి ఘటనపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ రవీందర్ నాయక్ ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, డీసీహెచ్ ఎస్ రవిబాబు,సంబంధిత వైద్య అధికారులు, ఆరోగ్య సిబ్బందితో సమావేశమై గర్భిణికి అందించిన వైద్య సేవలు, చికిత్స వివరాలు, రిఫరల్ ప్రక్రియ, సంఘటనకు దారితీసిన పరిస్థితులు తదితర అంశాలపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం సంబంధిత రికార్డులను పరిశీలించి, విధుల నిర్వహణలో ఎలాంటి లోపాలు జరిగాయో సమగ్రంగా విచారణ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విచారణ నివేదికను త్వరితగతిన ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు.అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతి, మాతా-శిశు ఆరోగ్య సేవలు, కుటుంబ నియంత్రణ, వ్యాధి నియంత్రణ కార్యక్రమాలు,

అసంక్రమిత వ్యాధుల (ఎన్‌సీడీ) స్క్రీనింగ్, టీకా కార్యక్రమం, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల పనితీరు,సికిల్ సెల్ అనీమియా నియంత్రణ కార్యక్రమం, క్షయవ్యాధి నిర్మూలన, కుష్ఠు నిర్మూలన, వెక్టర్ బోర్న్ వ్యాధుల నివారణ తదితర అంశాలపై కార్యక్రమాల వారీగా సమీక్ష నిర్వహించారు. మాతా-శిశు మరణాల నివారణకు ప్రతి ఆరోగ్య కార్యకర్త బాధ్యతాయు తంగా పనిచేయాలని, వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు ప్రతాప్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ దినేష్ పాల్గొన్నారు.