28 June, 2026 | 2:30 AM

వరదవెల్లి గుట్టపై 400 ఏళ్లనాటి దత్తాత్రేయుడు

28-06-2026 12:43 AM

ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలోని గుట్టపై 400 ఏళ్ల క్రితమే శ్రీశ్రీశ్రీ దత్తాత్రేయ స్వామి వెలిశాడు. దత్త జయంతి ఉత్సవాలు గత 45 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా వైభవంగా వేడుకలను ఆలయ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. గుట్ట చుట్టూ నీళ్లు ఉంటే బోటింగ్ సౌకర్యం ఉండడంతో నిత్య పూజలకు ఎటువంటి ఆటంకం కలగడం లేదు.

ప్రతి పౌర్ణమి రోజు కూడా ప్రత్యేక పూజలు, అన్నదానం చేస్తున్నారు. దీంతో భక్తులు తరలివస్తూ.. తమతమ మొక్కులను తీర్చుకుంటు న్నారు. తెలంగాణ రాష్ట్రంలో శ్రీదత్తాత్రేయ స్వామి ఆలయం ఎక్కడ కూడా లేకపోవడంతో.. భక్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతూ వస్తోంది. 

వరదవెల్లిలోని గుట్టపైన 400 సంవత్సరాల క్రితం వెంకట అవధూత అనే ఋషి గుట్టపైన తపస్సు చేశారని, ఆ సమయంలో గుట్టపైన రాళ్లలో వెంకటేశ్వరస్వామి దేవాలయం విగ్రహాలు కనిపించాయని వేద పండితులు, గ్రామస్తులు తెలిపారు. అటు పక్కనే దత్తాత్రేయుడు కూడా ఉంటాడని చెప్పగా అప్పుడు గ్రామస్తులు దత్తాత్రేయుని విగ్రహం కనిపించినట్లు వారు చెప్పారు. అదే గుట్టపైన దత్త వెంకటరమణ దేవాలయం కుడి పక్కన ఉండగా, ఎడమవైపున రాహు షయన దత్త రూపంలో కనిపించగా అప్పటి నుంచి నిత్య పూజలు చేస్తున్నారు.

ఈ విధంగా గుట్టపైన శ్రీశ్రీశ్రీ దత్తాత్రేయస్వామి వెలసినట్లు చెబుతున్నారు. ఈ శ్రీ దత్తాత్రేయస్వామి గుట్టను గ్రామస్తులు, భక్తులు సమిష్టిగా ముస్తాబు చేసి, దాతల సహాయంతో ఆలయాన్ని అభివృద్ధి చేశారు. వరదవెల్లి గ్రామస్తులు వేద పండితులైన రత్నాకర్ శర్మ దత్తాత్రేయస్వామి ఆలయంలో పూజలు చేస్తున్నారు. కాలక్రమేనా బోయినపల్లి మండలం మానువాడ వద్ద శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో వరదవెళ్లి ముంపునకు గురైంది. దీంతో గుట్ట చుట్టూ నీళ్లు ఉంటే కొన్ని రోజులు పూజలు నిలిచిపోయాయి.

గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ తన నిధుల నుంచి 2023 నవంబర్‌లో బోట్లను మంజూరు చేశారు. దీంతో అప్పటి నుంచి గుట్ట చుట్టూ నీరు ఉంటే  ప్రతి పౌర్ణమి నాడు వేద పండితులు బోటులో వెళ్లి నిత్యపూజలు చేసి వస్తుండేవారు. ప్రస్తుతం మానువాడ శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో నీరు లేకపోవడంతోపాటు, గుట్ట చుట్టూ కూడా నీరు లేదు. దీంతో భక్తులు, ప్రజలు యధావిధిగా గుట్ట పైకి వెళ్లి, రోజు నిత్య పూజలతోపాటు, ప్రతి గురువారం ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

అన్నదానం కూడా చేస్తున్నారు. అదేవిధంగా గ్రామస్తులు ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడు నుంచి 5వ తేదీ వరకు దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక ఉత్సవాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుంచి కూడా భక్తులు హాజరై, మొక్కులు తీర్చుకుంటున్నారు. గత సంవత్సరం ప్రభుత్వం టూరిజం శాఖ ద్వారా 5 బోట్లను ఏర్పాటు చేయగా భక్తులు అధిక సంఖ్యలో వెళ్లి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. రెండు లక్షల పైన భక్తులు వచ్చి ఉంటారని గ్రామస్తులు తెలిపారు.

 రోమాల రవీందర్, విజయ క్రాంతి, బోయినపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా

ఆలయ ఆదాయానికి గండి పడింది

ఆరు నెలల క్రితం బోటింగ్ నిర్వహణను రాష్ట్ర టూరిజం శాఖ స్వాధీనం చేసుకోవడంతో దత్తాత్రేయ స్వామి ఆలయముకు వచ్చే ఆదాయానికి గండి పడింది. ఇంతకుముందు బోటింగ్ నిర్వహణ ఆలయ కమిటీ నిర్వాహకులు చూసుకునేవారు. దీంతో బోటింగ్ ద్వారా వచ్చే ఆదాయం ఆలయ నిర్వహణకు ఉపయోగపడుతుండేది. ప్రస్తుతం రాష్ట్ర టూరిజం శాఖ తీసుకోవడంతో ఆదాయానికి గండి పడింది. బోటింగ్ నిర్వహణ క్యూ లైన్ ఆలయ కమిటీ వారు చూసుకుంటుండగా, బోటింగ్ ఆదాయం మాత్రం టూరిజం శాఖ వారు తీసుకుంటున్నారు. ఈ విషయం ప్రభుత్వం పునరాలోచించి ఆలయానికి ఆదాయం వచ్చే విధంగా చూడాలి. 

 ఆడెపు రాజు, దత్తాత్రేయ ఆలయ కమిటీ క్యాషియర్ 

ప్రతి ఏటా పెరుగుతున్న భక్తుల సంఖ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి దత్తాత్రేయస్వామికి ప్రతి ఏటా భక్తుల ఆదరణ పెరుగుతోంది. దీంతోపాటు భక్తుల సంఖ్య కూడా అధికమవుతోంది. ప్రస్తుతం గుట్టచుట్టూ నీళ్లు లేకపోవడంతో ప్రతి పౌర్ణమిన నిత్యపూజలు చేస్తున్నాం.

 యాటకల్ల శ్రీనివాస్ దత్తాత్రేయ దేవాలయ కమిటీ అధ్యక్షులు