ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు
మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహణ
కరీంనగర్, జూలై 11 (విజయ క్రాంతి): కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు శనివారం నగరంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. మేయర్ కొలగాని శ్రీనివాస్ తీగలగుట్టపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి జన్మదినోత్సవ వేడుకలను ప్రారంభించి, నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలకు హాజరై కేక్ కట్ చేశారు.తీగల గుట్టపల్లిలోని శ్రీకోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బండి సంజయ్ కుమార్ ఆయురారోగ్యాలతో, ప్రజా సేవలో మరిన్ని విజయాలు సాధించాలని భగవంతుడిని మేయర్ ప్రార్థించారు. అనంతరం తెలంగాణ చౌక్‌లో బీజేపీ జిల్లా జిల్లా శాఖ, నగరపాలక సంస్థ ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన 54 కిలోల భారీ కేక్‌ను కట్ చేశారు.
కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా మేయర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, దుప్పట్ల పంపిణీ చేశారు. పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో, బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో నాకా చౌరస్తాలో చేపట్టిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదాతలను ఉత్సాహపరిచారు. 35వ డివిజన్‌లో మొక్కలు నాటారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఈసీజీ, 2డీ ఈకో, బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులను పంపిణీ చేశారు. మంచిర్యాల చౌరస్తాలోని వికలాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. బీజేపీకార్పొరేటర్ ఏపీపీ చంద్ర ఆధ్వర్యంలో ప్రభుత్వ సివిల్ హాస్పిటల్‌లో ఏర్పాటుచేసిన అల్పాహార పంపిణీ కార్యక్రమంలోమేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు, కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.






