12 July, 2026 | 2:24 AM

రేవంత్‌రెడ్డి తిరిగి ఎన్నికయ్యేది కలే

12-07-2026 01:06 AM
  1. కాళేశ్వరం నీటిని ఎత్తిపోయకుండా తెలంగాణ ప్రజలపై పగబట్టాడు
  2. సీఎం సొంత సర్వేలో బీఆర్‌ఎస్‌కు 78 సీట్లు వచ్చింది నిజమే..
  3. తాను సర్వే చేయించుకోలేదని రేవంత్‌రెడ్డి దేవునిపై ఒట్టేయాలి
  4. మళ్లీ గెలుస్తానని నమ్మకం ఉంటే వెంటనే ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి
  5. ఢిల్లీకి ఈఎంఐ కట్టే సీఎం రేవంత్‌రెడ్డి
  6. మేడిగడ్డతో కాదు.. పోలవరంతోనే భద్రాచలానికి ముప్పు
  7. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): ఇక రేవంత్ రెడ్డి తిరిగి ఎన్నికయ్యేది కలే అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం నీటిని ఎత్తిపోయకుండా తెలంగాణ ప్రజలపై పగబట్టాడు. సీఎంకు నీళ్లు ఎత్తిపోయడం తెల్వదు..కానీ డబ్బు సంచులు ఎత్తిపోయడమే తెలుసు. ఢిల్లీకి ఈఎంఐ కట్టే సీఎం రేవంత్‌రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు. మేడిగడ్డతో కాదు.. పోలవరంతోనే భద్రాచలానికి ముప్పున్నారు. సీఎం సొంత సర్వేలో బీఆర్‌ఎస్‌కు 78 సీట్లు వచ్చింది ముమ్మాటికి నిజమన్నారు.

సీఎం తాను సర్వే చేయించుకోలేదని దేవుడిపై ఒట్టు వేసి చెప్పాలన్నారు. రాముడిపైన ఒట్టు వేసి అబద్ధాలు చెబితే రేవంత్‌రెడ్డికి నష్టం జరుగుతుందని కేటీఆర్ హెచ్చరించారు. తన పాలన పట్ల అంత నమ్మకం ఉంటే, రేవంత్‌రెడ్డికి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు లేదా పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానా ల్లో ఉప ఎన్నికలు లేదంటే, అసెంబ్లీని రద్దు చేసి తిరిగి ఉపఎన్నికలకు  పోవాలని సవాల్ చేశారు. మొలవది అనుకున్న ప్రత్యేక తెలంగా ణ రాష్ట్రాన్ని ఉద్యమించి, సబ్బండ వర్గాలను ఏకం చేసి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆ ర్ అన్నారు.

అలాంటి ఆయన గురించి మాట్లాడే స్థాయి రేవంత్‌రెడ్డికి లేదన్నారు. రేవంత్ రెడ్డికి ఎత్తు ఒక్కటే తక్కువ అనుకుంటే బుర్ర కూడా తక్కువే అని ఇప్పుడు తెలిసిందన్నారు. శనివా రం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ 2014 నుంచి పదుల సంఖ్యలో ఎన్నికలు ఓడిపోయారని, మరి కాంగ్రెస్ పార్టీ పని కూడా అయిపోయిన ట్టేనా అని ప్రశ్నించారు. లక్షల క్యూసెక్కుల నీరు కిందికి పారుతుంటే తెలంగాణని కరువు కాటకాల ముందు నిలబెట్టే కుట్ర రేవంత్‌రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు.

కాళేశ్వరంలో మేడిగడ్డతో సంబంధం లేకుండా మొత్తం గోదావ రి పరీవాహక ప్రాంతం రైతన్నలకు, ప్రజలకు నీళ్లు అందించే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్‌రెడ్డి మూర్ఖత్వంతో, తెలివి తక్కువతనంతో, గత ప్రభుత్వం పైన ద్వేషంతో పంటలను ప్రజలను ఎండబెడుతున్నారని మండిపడ్డారు. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని అక్కడ పారుతున్న నదిని ప్రజలకు చూపించడంతోనే తన బండారం బయటపడింద న్నారు. అందుకే రేవంత్‌రెడ్డికి పిచ్చి లేసి అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. ఒకవైపు ప్రజలు, రిటైర్డ్ ఇంజనీర్లు, పార్టీల నేతలు నీటిని ఎత్తిపోసి, రానున్న కరువును ఆపాలని డిమాండ్ చేస్తూ ఉంటే రేవంత్‌రెడ్డి మాత్రం తెలంగాణ నీళ్లను తన గురువు కోసం కిందికి వదిలిపెడుతున్నారని విమర్శించారు. 

మేడిగడ్డతో సంబంధం లేకుండానే నీళ్లు ఎత్తిపోయవచ్చు

ప్రస్తుతం గోదావరి బేసిన్‌లోని రిజర్వాయ ర్ల స్టోరేజీ కూడా సగానికి పైగా ఖాళీగా ఉందని, మరోవైపు కన్నెపల్లి దగ్గర లక్షల క్యూసెక్కుల నీరు కిందికి పారుతోందని కేటీఆర్ అన్నారు. రానున్న అక్టోబర్ వరకు కూడా ఈ లక్షల క్యూసెక్కుల నీరు కిందికి వృథాగా పోయే ప్రమాదం ఉన్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగానే రైతుల పట్ల, తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ నీటిని రానున్న 100 రోజు ల పాటు కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ ప్రారంభించి, ఎత్తిపోస్తే.. గోదావరి బేసిన్ మొత్తం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు.

‘కాంగ్రెస్ ప్రభుత్వానికి మాపైన కోపం ఉండవచ్చు లేదా ద్వేషం ఉండవచ్చు.. కానీ తెలంగాణ ప్రజల పైన, రైతన్నల పైన అక్కసు పెట్టుకోవ ద్దు. కిందికి పారుతున్న నీటిని ఎత్తిపోస్తే అందరికీ మంచి జరుగుతుంది’ అని సూచించారు. మేడిగడ్డతో ఎలాంటి సంబంధం లేకుండానే, ఒక్క గేటు కూడా మూయకుండానే, కన్నెపల్లి వద్ద 93 మీటర్ల ప్రవాహం నమోదైన ప్రతిసారి భారీగా నీళ్లను ఎత్తిపోసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పుడు కన్నేపల్లి వద్ద 97 మీటర్ల నదీ ప్రవాహం ఉందని, ఒక్క బటన్ ద్వారా పంపులు ప్రారంభించి, నీటిని ఎత్తిపోస్తే తెలంగాణ కరువు నుంచి దూరం అవుతుందన్నారు. 

పోలవరంతోనే భద్రాచలానికి ముప్పు

ఒకవైపు నీళ్లు లేక ప్రజలు, రైతన్నలు ఏడుస్తుంటే... రేవంత్‌రెడ్డి పైశాచిక ఆనందంతో నీళ్లు ఎత్తిపోయకుండా చూస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. కన్నెపల్లి దగ్గర నీళ్లు లేకుంటే, మరి కిందికి పోతున్న ఆ నీటితోనే పక్క రాష్ట్రంలోని పట్టిసీమ ఎలా పనిచేస్తుంది? వందల టీఎంసీలను ఎలా ఎత్తిపోస్తుందో రేవంత్‌రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. కేవలం తన తెలంగా ణ ప్రాజెక్టుల గురించి మాట్లాడితే తన గురువుకి కోపం వస్తుందనే రేవంత్‌రెడ్డి లేనిపోని అబద్ధాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

భద్రాచలానికి ప్రమాదం ఉంది అంటే అది ముమ్మాటికీ పక్క రాష్ట్రం కడుతున్న పోలవరంతోనే కానీ, కాళేశ్వరంతో కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. కన్నెపల్లి దగ్గర పుష్కలంగా నీరు ఉంటే, రాజకీయ ద్వేషంతో కళ్లు మూసుకుపోయి, వందల టీఎంసీల నీరు కిందికి పోతుంటే ఎత్తిపోయకుండా తెలంగాణ రైతాం గం పైన పగబట్టిన రేవంత్‌రెడ్డి ముమ్మాటికీ బుర్ర తక్కువోడు అని విమర్శించారు. పక్క రాష్ట్రం వాళ్లు పంప్ హౌసులు ప్రారంభించుకొని నీళ్లు ఎత్తిపోసుకుంటే, కన్నెపల్లి పంప్ హౌస్‌కు తాళం వేసిన దరిద్రుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం మాత్రమే కాకుండా దేవాదుల పంపులు కూడా ప్రారంభించకుండా వరంగల్ జిల్లా రైతుల నోట్లో మట్టి కొడుతున్న రైతు వ్యతిరేకి రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు.

ఇప్పటికైనా పంప్ హౌస్‌లు ప్రారంభిం చి, నీళ్లను ఎత్తిపోయ కుంటే రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు తిరగబడతారని, రేవంత్‌రెడ్డి తెలంగాణకి సాగునీటి రంగంలో చేస్తున్న ద్రోహానికి చరిత్రహీనుడుగా, రైతుద్రోహిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక ప్రభుత్వంగా మిగిలిపోతుందని హెచ్చరించారు. కావాలనే రైతాంగంపై కుట్ర చేస్తున్న కాంగ్రెస్ వైఖరిని ఇంకో రెండు, మూడు వారాలు చూసి పార్టీగా ఒక భారీ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

కేసీఆర్ తయారు చేసిన క్రమశిక్షణ కలిగిన సైనికుడు, పార్టీ ప్రారంభం నుంచి ఆయనకి అండగా నిలబడ్డ నాయకుడు హరీశ్‌రావు అనారు. హరీశ్‌రావు పైన ఇలాంటి చిల్లర పుకార్లు ఎన్నోసార్లు వచ్చాయని, వాటికి ఆయన స్పష్టంగా సమాధానం ఇచ్చారన్నారు. అయినా రేవంత్‌రెడ్డి లాంటి పార్టీలు మారే వ్యక్తి ఇతరుల గురించి మాట్లాడడం.. సిగ్గుచేటన్నారు. పొద్దున లేస్తే కాంగ్రెస్‌తో, అర్ధరాత్రి బీజేపీతో కలిసి ఉండే రేవంత్‌రెడ్డి ఇతరుల గురించి మాట్లాడడం ఆపాలని హితవు పలికారు.

200 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలి

రానున్న 100 రోజుల పాటు కనీసం 200 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీంతో గోదావరి బేసిన్‌లో ఉన్న మిడ్ మానేరు, లోయర్ మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అనంతగిరి, మల్కపేట, బస్వపూర్ రిజర్వాయర్లు అన్నీ నిండుతాయని వివరించారు. దీంతో సగం తెలంగాణకి వ్యవసాయ, తాగునీటి సంక్షోభం రాకుండా చూసుకోవచ్చని అన్నారు. కానీ సీఎం కేవలం మతిలేని మాటలు మాట్లాడుతూ తెలంగాణను కరువు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

ఇప్పటికే అన్నారం, సుందిళ్ల విషయంలో కూడా గ్రౌటింగ్ పూర్తయిందని, అక్కడ సురక్షితంగా నీటిని నిల్వ చేసి వాడుకోవచ్చు అని ప్రభుత్వంలోని ఇంజనీర్లే స్పష్టం చేస్తున్నా రు. అయినా కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మేడిగడ్డ గేట్లు మూసి నీళ్లు ఎత్తాలని ‘మేం ఏనా డూ చెప్పలేదు’ అని, రేవంత్‌రెడ్డి అచ్చోసిన ఆంబోతులా నోటికి వచ్చినట్లు రంకెలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ముంగిట నిలబడ్డది కాలం తెచ్చిన కరువు కాదు, కాం గ్రెస్ తెచ్చిన కరువు అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు.

ఇతర రాష్ట్రాల సీఎంలు వాళ్ల ప్రాజెక్టుల్లో నీళ్లు ఎలా నింపుకోవచ్చో ప్రయత్నం చేస్తుంటే మన సీఎం మాత్రం ప్రాజెక్టులు కొట్టుకుపోతాయంటూ దరిద్రపుగొట్టు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 500 సంవత్సరాలలో ఎప్పుడూ రానంత భారీగా 28.5 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా కొట్టుకుపోకుండా మేడిగడ్డ బరాజ్.. గట్టిగా నిలబడిందన్నారు. కేవలం లక్ష క్యూసెక్కుల నీటిని తట్టుకోదు, భద్రాచలం రాముడితో పాటు 44 ఊర్లు మునిగిపోతాయని సీఎం అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.