సెమీ కండక్టర్ హబ్‌గా రాష్ట్రం
- దేశంలోనే తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీస్ కారిడార్ హైదరాబాద్‌లో ఏర్పాటు
- ప్రభుత్వ లక్ష్య సాధనలో కీలకపాత్ర
- ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): తెలంగాణను దేశంలోనే ప్రముఖ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఈ లక్ష్య సాధనలో సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్ కీలక పాత్ర పోషిస్తుం దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో చిప్‌ల తయారీలో అత్యంత కీలకమైన కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోనే తొలి హబ్ హైదరాబాద్‌లో ఏర్పాటైందని తెలిపారు.
జపాన్‌కు చెందిన తోహో కోకి సీసాకుషో కంపెనీ లిమిటెడ్ సహకారంతో టీ-వర్క్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని శ్రీధర్‌బాబు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెమీకండక్టర్ చిప్‌ల తయారీలో వాఫర్‌ను సమతలంగా మార్చేందుకు ఉపయోగించే ఈ సీఎంపీ ప్యాడ్లను ప్రస్తుతం పూర్తిగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు.
ఈ హబ్ ఏర్పాటుతో ఇప్పటివరకు విదేశాలకే పరిమితమైన సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ తొలిసారిగా దేశంలో హైదరాబాద్ వేదికగా అందుబాటులోకి వచ్చిందన్నారు. విద్యార్థులు, పరిశోధకులు, ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు, పరిశ్రమ లకు ఈ కేంద్రం ద్వారా శిక్షణతో పాటు పరిశోధనలు చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామ న్నారు.
ప్రముఖ విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈల భాగస్వామ్యంతో వచ్చే 18 నుంచి 24 నెలల్లో సీఎంపీ ప్యాడ్లను దేశంలోనే తయారు చేసేలా సంయుక్త పరిశోధనలు చేపడతామని వివరించారు. సెమీకండక్టర్ రంగం లోని అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చు కునేం దుకు జపాన్ లాంటి దేశాలతో కలిసి ముందుకు సాగుతున్నామన్నారు.
పరిశోధన నుంచి చిప్ల తయారీ వరకు అవసరమైన సమగ్ర ఎకోసిస్టంను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోహో కోకి సీసాకుషో కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి టకుయా నిషిమురా, జెట్రో బెంగళూరు డైరెక్టర్ జనరల్ స్వస్తిక్ కులకర్ణి, ఇండోబాక్స్ వ్యవస్థాపకుడు, సీఈ వో డైసుకే టాంజి, జపాన్ ఇండియా బిజినెస్ బ్యూరో చైర్మన్ షిగెమారో యాసుయి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-వరక్స్ సీఈవో జోగిందర్ తనికెళ్ల తదితరులు పాల్గొన్నారు.
షాబాద్ ఘటన ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తాం
షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో ఆరుగురిని హత్య చేసిన ఘటనపై రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మారణకాండకు కారకుడైన ఉన్మాదిని అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపామని తెలిపారు.
హంతకుడు ఏ మూలన నక్కినా పట్టుకుంటామని అన్నారు. బాధిత కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసారని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.






