12 July, 2026 | 1:09 AM

ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సులు

12-07-2026 12:07 AM
  1. రైతు సంక్షేమమే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక
  2. అదే ప్రజా ప్రభుత్వ పాలనా తత్వం
  3. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్
  4. కోదాడలో ఆర్టీసీ బస్ డిపో నిర్మాణానికి శంకుస్థాపన 

హుజూర్‌నగర్/కోదాడ, జూలై 11 (విజయక్రాంతి): రాష్ర్టంలో ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సులు నడపాలనేది ప్రజాప్రభుత్వ లక్ష్యమని నీటి పారుదల, సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రూ.21 కోట్ల వ్యయంతో శనివారం సూర్యాపేట జిల్లా కోదాడలో నూతన ఆర్టీసీ బస్ డిపో నిర్మాణానికి, హుజూర్‌నగర్ బస్‌స్టాండ్ ఆధునికీకరణ పనులకు మంత్రులు శంకుస్థాపనలు చేశారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని చెప్పారు. రెడ్లకుంట, ఆర్--9, శాంతినగర్ ఎత్తిపోతల పథకాలతో పాటు నాగార్జునసాగర్ ఆయకట్టు మేజర్, మైనర్ కాలువలకు లైనింగ్ పనులు చేపట్టి ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో కూడా చారిత్రాత్మక పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు.

రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల, రూ.50 కోట్లతో జవహర్ నవోదయ పాఠశాల, రూ.26 కోట్లతో సిటీ స్కాన్ సౌకర్యంతో కూడిన 100 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి, యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందించే అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కోదాడ పురపాలక సంఘాన్ని ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు.

అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి రాజకీయ భేదాలు లేవు. ప్రతి గ్రామం, ప్రతి రైతు, ప్రతి విద్యార్థి, ప్రతి మహిళ, ప్రతి యువకుడు ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను అందుకోవాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా తత్వమని పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌లో లక్షలాది ప్రయాణికులకు ఆధునీకరణమైన బస్ స్టేషన్ అందుబాటులోకి తేవడం మాకు గర్వకారణమని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల వ్యవధిలోనే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించామని, ఇప్పటివరకు 11 వేల కోట్ల వరకు ఉచిత బస్ ప్రయాణాలు జరిగాయని, 2800 నూతన బస్సులు కొనుగోలు చేశామన్నారు. 3500 మందికి ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతి రోజు 60 లక్షల కిలోమీటర్లు నడిపిస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు కండక్టర్లకు ఇతర కార్మికులకు ప్రత్యేక ధన్యవాదములు అన్నారు.

హుస్నాబాద్ లో ప్రాజెక్ట్ కట్టడానికి రెండు వందల కోట్ల రూపాయలు భూసేకరణకు కేటాయించిన మంత్రి ఉత్తమ్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఒక వైపు కాళేశ్వరం కూలిపోతుంటే మరో సారి మూడు నెలలు మంత్రి పదవి కేటాయించాలంటు మాజీ మంత్రి హరీష్ రావును ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, ఎండీ నాగిరెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్లు దొంతగాని శ్రీనివాస్, ఏర్నేని కుసుమబాబు, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, పట్టణ అధ్యక్షుడు గెల్లి రవి, సంపత్ రెడ్డి, సులువ నాగలక్ష్మి చందు, పద్మ తదితరులు పాల్గొన్నారు.