8 May, 2026 | 3:56 AM

బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి అవసరం

08-05-2026 12:04 AM

డీఆర్డీఓ దత్తరావు 

వాంకిడి, మే 7 (విజయ క్రాంతి): కిషోర బాలికల రక్షణ, విద్యాభివృద్ధి కోసం తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని కుమ్రం భీం జిల్లా గ్రామీణా భివృద్ధి అధికారి (డీఆర్డీఓ) దత్తరావు సూచించారు. వాంకిడి మండలం ఖమాన గ్రామ రైతు వేదికలో గురువారం కిషోర బాలికల తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ దత్తరావు మాట్లాడుతూ మే 2 నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తున్న సమ్మర్ క్యాలెండర్ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంత బాలికల్లో చైతన్యం పెంపొందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా బాల్య వివాహాల నివారణపై ప్రతి కుటుంబం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. బాలికల ఆరోగ్యం, ఉన్నత విద్య, ఆర్థిక అవగాహన, వ్యక్తిత్వ వికాసం, సైబర్ భద్రత వంటి అంశాలపై తల్లిదండ్రులకు సమగ్ర అవగాహన కల్పించారు.బాలికలను చదివించి స్వయం సమర్థులుగా తీర్చిదిద్దితేనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

గ్రామ స్థాయిలో మహిళా సంఘాలు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ బాలికల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు.కార్యక్రమంలో డీపీఎంలు రామకృష్ణ, యాదగిరి, ఏపీఎం. ధనరాజ్, మహిళా సారధికారిత శారద, రాణి, వీఓ అధ్యక్షురాలు రేణుక, సీసీలు భీంరావు, రమేష్, వీ.ఓ.ఎస్ లు, ఆనంద్రావు, బాబురావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.