ప్రజలను ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరికాదు
కొల్లాపూర్ రూరల్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గంలో మూడో రోజు విస్తృతంగా పర్యటించారు. పెంట్లవెల్లిలో ప్రజలు, రైతుల నుంచి సమస్యలను తెలుసుకున్నారు. మ్యూటేషన్ల కోసం ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని రైతులు మంత్రికి ఫిర్యాదు చేయగా.. అధికారుల తీరుపై జూపల్లి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజలను ఏళ్ల తరబడి తిప్పించుకోవడం సరికాదని, రెవెన్యూ సమస్యలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం, జాప్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం పెంట్లవెల్లిలో ప్రతిపాదిత స్టేడియం స్థలాన్ని పరిశీలించారు. కొల్లాపూర్, వీపనగండ్ల, కేతపల్లి, కోడేరు, పెద్దకొత్తపల్లిలో స్టేడియాల నిర్మాణానికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజల ఆశీర్వాదమే తనకు బలమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.






