పుట్టిన గడ్డ అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐల భారీ విరాళం
* అమెరికా పర్యటనలో ఆనాడు ఎన్నారైలను కలిసిన ఎమ్మెల్యే నాయిని
* కేఎంసీ మౌలిక సదుపాయాల కోసం రూ.10 కోట్లు ప్రకటించిన ప్రవాస భారతీయులు
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): స్వదేశం పట్ల మమకారం, పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో ఎన్‌ఆర్‌ఐల బృందం ముందుకు వచ్చింది. హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గతంలో అమెరికాలో పర్యటించిన క్రమంలో అమెరికాలో స్థిరపడిన ఎన్నారైలను ప్రత్యేకంగా కలసి వరంగల్ వాసులుగా నగరానికి మీవంతు సహకారం అందించాలని కోరారు.
ఈ మేరకు డాక్టర్ సుజీత్ కుమార్ నేతృత్వంలోని సుమారు 200 మంది ఎన్‌ఆర్‌ఐలు కలిసి, కాకతీయ మెడికల్ కాలేజ్ (కేఎంసీ) మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.10 కోట్ల విరాళం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆధునిక వైద్య పరికరాలు, అదనపు వార్డులు, రోగుల కోసం అవసరమైన సౌకర్యాలు, విద్యార్థులకు శిక్షణ వనరులు వంటి అంశాలపై ఈ నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో వేలాది మంది ప్రజలు కేఎంసీ, ఎంజీఎం ఆసుపత్రులపై ఆధారపడుతున్నారు.
ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇవే ప్రధాన వైద్య కేంద్రాలు. ఈ విరాళం ద్వారా అత్యాధునిక సీటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి పరికరాల ఏర్పాటు, అత్యవసర వైద్య విభాగాల బలోపేతం, శస్త్రచికిత్స సదుపాయాల విస్తరణకు దోహదం కానుంది. ఇటీవలి కాలంలో నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజ్, తాగునీటి సదుపాయాలు, విద్యాసంస్థల అభివృద్ధి వంటి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. ఆరోగ్య రంగంలోనూ అదే దిశగా పురోగతి సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడిన స్వగ్రామ అభివృద్ధి కోసం ఇంత పెద్ద మొత్తాన్ని ప్రకటించడం గర్వకారణం. ఇది కేవలం విరాళం కాదు, వరంగల్ పశ్చిమ ప్రజల ఆరోగ్య భద్రతకు పెట్టుబడి అని అన్నారు. ఎన్‌ఆర్‌ఐల సేవాభావం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. మన వరంగల్ నుంచి విద్యను అభ్యసించి విదేశాల్లో స్థిరపడిన అందరూ వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
బిఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం - అసత్య ప్రచారాల్లో ప్రథమం
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డబ్బులకోసం చేసే రాజకీయాలకే బిఆర్ఎస్ పరిమితమైందని, పదేళ్ల పాలనలో అభివృద్ధిని కుంటుపడేసి, ఇప్పుడు విమర్శలు అనే ఆయుధంగా చేసుకుని జిల్లాలో జెమినీ సర్కస్ మాదిరిగా పర్యటన చేస్తున్నారని అన్నారు.
మూడు రోజులుగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం సమగ్రంగా ఆలోచిస్తుందని తెలిపారు. పదిఏళ్లలో చేయలేని వారు ఇప్పుడు పరిశీలన పేరుతో మాట్లాడడం సిగ్గుచేటని, దాదాపు పూర్తికవచ్చిన హాస్పటల్ ను విమర్శ చేయడం తగదని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా విభజించినప్పుడు కాని, నిధులు కేటాయింపుల విషయంలో కానీ, మీ నాయకులైన కెసిఆర్, కేటీఆర్, హరీష్ లను ఎప్పుడైనా ప్రశ్నించారా, పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి ఎంత, గత రెండేళ్లలో జరిగిన అభివృద్ధి ఎంత అనే అంశంపై చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు.
బినామీ పేర్లతో కోట్ల రూపాయలు కూడబెట్టిన నేతలు ఇప్పుడు పారదర్శకత్వంపై మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారని, టెక్స్ట్ టైల్ పార్క్ పేరుతో అట్టహాసంగా ప్రకటించిన ప్రాజెక్టు భూమి దశ దాటలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని, రెండున్నర ఏళ్లలో తీసుకొచ్చిన పనులు ఎటువంటి అవకతవకత లేకుండా కొనసాగుతున్నాయని తెలిపారు. కాంట్రాక్టర్లపై కమిషన్ల ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. సలహాలు ఉంటే ఇవ్వండి ఎన్నికల వరకు రాజకీయాలు చేద్దాం కాని, దాడుల రాజకీయాలను నేనెప్పుడూ ప్రోత్సహించను అని అన్నారు.
విద్యావంతులకు విజ్ఞప్తి చేస్తున్న ఎన్నికల సమయంలో తప్పకుండా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని, లేకుంటే గుండాలు, రౌడీలు రాజ్యమేలుతారని, ప్రజల తీర్పే తుది తీర్పు అని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కేఎంసి ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, ఆర్టిఏ నెంబర్ పల్లకొండ సతీష్, ఆలయ కమిటీ డైరెక్టర్ సతీష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్ యాదవ్ నాయిని లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు నలుగోలు సతీష్ సుగుణాకర్ రెడ్డి, ఎనుకుంటి పున్నం చందర్, తడుక సుమన్ గౌడ్, నాగరాజు, కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.




