‘గుడి’ పేరుతో ‘బడి’కి ఎసరు..
- కొత్తపల్లిలో అభివృద్ధి అడ్డగింత వెనుక అసలు కథ..!
- అంగన్వాడీ, పంచాయతీ భవనాలకు స్థలం ఇస్తే ‘ఆలయ ఆక్రమణ’ అంటూ వినతులు... నిధులు వెనక్కి వెళ్లడానికి ఎవరు కారణం?
చర్ల, జూన్ 25,(విజయక్రాంతి): దేవుడి పేరు చెప్పి పిల్లల చదువుకు, గ్రామ పాలనకు అడ్డుపడుతున్న తీరు కొత్తపల్లిలో సంచలనం రేపుతోంది. ప్రభుత్వం నిధులు ఇచ్చి అంగన్వాడీ, పంచాయతీ భవనాలు కట్టమంటే, ‘అభయాంజనేయ స్వామి ఆలయాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు‘ అంటూ బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ పేరుతో కొందరు తహసీల్దార్కు వినతిపత్రాలు ఇస్తున్నారు. దీంతో లక్షల నిధులు వెనుదిరిగి, గ్రామం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లింది.
ప్రభుత్వ భూమి: మిషన్ భగీరథ ట్యాంక్ ముందు ఉన్న 5 సెంట్ల స్థలం రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమి. అంగన్వాడీ కోసం సర్పంచ్ ప్రతిపాదిస్తే, దానిని ‘గుడి భూమి‘ అంటూ అడ్డుకున్నారు. అదే గ్రామానికి చెందిన గుమ్మడి సత్యనారాయణ గారు తన తండ్రి గుమ్మడి రత్నయ్య జ్ఞాపకార్థం పంచాయతీ భవనం కోసం 10 సెంట్ల ప్రైవేట్ స్థలం ఇస్తే, ‘ఇది గుడి స్థలం, ప్రైవేటు భవనాలకు ఇవ్వరాదు‘ అని బ్యానర్ కట్టి దాతను వెనక్కి లాగారు. కొత్తపెళ్లి గ్రామంలో అంగన్వాడీ, పంచాయతీ భవనాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. స్థలం చూపించకపోవడంతో ఆ ఫైళ్లు రిటర్న్ అయ్యాయి. ఇప్పుడు అంగన్వాడీ స్కూలు గదిలో, పంచాయతీ అద్దె కొంపలో నడుస్తోంది.
ప్రజల మెదడు తొలిచే ప్రశ్నలు: గుడి పక్కన అంగన్వాడీ ఉంటే ఆక్రమణ ఎలా అవుతుంది? 2-6 ఏళ్ల పిల్లలు దేవుడితో సమానం కాదా?- దాత ఇచ్చే సొంత స్థలాన్ని ‘గుడిది‘ అని ఎలా ప్రకటిస్తారు? ఇది దాతను అవమానించడం కాదా?
‘క్రైస్తవులు, కమ్యూనిస్టులు, నాస్తికులు ఆక్రమించాలని చూస్తున్నారు‘ అని వినతిపత్రంలో రాయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? గ్రామంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమేనా?
అధికారులు తేల్చాల్సిన నిజాలు:
1. 68/3 సర్వే నెంబర్ భూమి రికార్డులు బయటపెట్టాలి. అది ప్రభుత్వానిదా? గుడిదా?
2. ప్రభుత్వ భూమిలో అంగన్వాడీ కడితే ‘ఆలయ ఆక్రమణ‘ ఎలా అవుతుందో తహసీల్దార్ వివరణ ఇవ్వాలి.
3. దాత స్థలానికి బ్యానర్ కట్టి బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలి.
4. నిధులు వెనుదిరగడానికి కారణమైన వారి నుంచి ప్రజాధనం రికవరీ చేయాలి.
గుడి ఉండాలి, బడి ఉండాలి, పంచాయతీ ఉండాలి. ఒకదాని పేరుతో మరొకటి ఆపడం అభివృద్ధి నిరోధక చర్య. దైవభక్తి ముసుగులో గ్రామాన్ని వెనక్కి లాగుతున్న శక్తులను జిల్లా కలెక్టర్ గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే కొత్తపల్లి పిల్లల భవిష్యత్తు, గ్రామ పాలన అంధకారంలో కూరుకుపోతుందని గ్రామ ప్రజలు యువత వేదన వ్యక్తం చేశారు.






