26 June, 2026 | 2:09 AM

కనీసం మట్టి పోయించిన పాపాన పోలేదు

26-06-2026 12:55 AM
  1. దుర్భర స్థితిలో ఉన్న రహదారి
  2. పలు పత్రికల్లో రహదారి గురించి వెలువడిన కథనాలు
  3. కనీస చలనం లేని మండల అధికారులు
  4. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, బాలింతలు, విద్యార్థులు, పాదచారులు

గుండాల, జూన్ 25 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని  కస్తూరిబా గాంధీ పాఠశాల-కళాశాల, పశు వైద్య కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాల,  ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం, వారాంతపు సంతకు వెళ్లే రహదారి పెద్ద పెద్ద బండ రాళ్లు, గుంతలతో కనీసం నడవడానికి కూడా వీలుగా లేకుండా అధ్వానంగా తయారైంది. ఈ వర్షాకాలంలో రహదారి పరిస్థితి కడు శోచనీయం. పాఠశాలలు, కళాశాలలు వేసవి సెలవుల అనంతరం ఇటీవలే తెరుచుకున్న దృష్ట్యా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో దింపే క్రమంలో ఈ రహదారిపై తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

రహదారి సమస్యపై పలు దినపత్రికలలో కథనాలు ప్రచురించినా కనీసం మండల అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత రోడ్డు దేవుడెరుగు కనీసం మట్టి పోయించి రోడ్డును బాగు చేద్దామన్న ఆలోచన కూడా అధికారులకు రాకపోవడం వారికున్న బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు నిదర్శనమని వారు అభిప్రాయపడుతున్నారు.  ఇదే రహదారి గుండా ఆరోగ్య ఉప కేంద్రానికి చిన్న పిల్లల టీకాల కోసం వెళ్లాలంటే తీవ్ర ఇబ్బంది నెలకొంటుందని బాలింతల తల్లిదండ్రులు వాపోతున్నారు.

స్తూర్బా గాంధీ పాఠశాల, కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే బట్టలు, పుస్తకాలు ఆర్టీసీ కార్గో ద్వారా సరఫరా చేస్తుండడంతో ఈ రహదారిలో కార్గో బస్సు అలాగే విద్యార్థులకు నిత్యం అందించే పాలు, కూరగాయల వాహనాలు వెళ్లాలంటే తీవ్ర అవస్థలు తప్పడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఇకనైనా మండల అధికారులు స్పందించి రహదారికి శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు, వాహనదారులు, పాదచారులు కోరుతున్నారు.