26 June, 2026 | 1:49 AM

మత్తు కోరల్లో తెలంగాణ!

26-06-2026 12:11 AM
  1. భవిత వినాశనానికి మేల్కొలుపు?
  2. పెరుగుతున్న ఎన్‌డీపీఎస్ కేసులు
  3. పాఠశాల విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్ పెడ్లర్ల పంజా
  4. పోలీసులకు, ప్రభుత్వానికి సవాల్ విసురుతున్న గంజాయి ముఠాలు
  5. రోజు రోజుకూ పెరుగుతున్న కేసులు
  6. నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం 

సంగారెడ్డి, జూన్ 25 (విజయక్రాంతి): తెలంగాణ సమాజాన్ని నార్కోటిక్స్ మహమ్మారి నిశ్శబ్దంగా అల్లేస్తోంది. ఒకప్పుడు కేవలం సంపన్న వర్గాలకో, మెట్రో నగరాల పబ్బులకో పరిమితమైన ఈ సంస్కృతి.. ఇప్పుడు విద్యాసంస్థల ముఖద్వారాల దాకా, గ్రామీణ ప్రాంతాల లోగిళ్ల దాకా విస్తరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

‘ఈగల్’ టాస్క్‌ఫోర్స్, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిరంతరం దాడులు చేస్తున్నప్పటికీ, డ్రగ్స్ నెట్‌వర్క్ రూపాంతరం చెందుతూ కొత్త సవాళ్లను విసురుతోంది. శుక్రవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, రాష్ర్టంలో మత్తు వ్యాప్తి తీవ్రతపై విజయక్రాంతి ప్రత్యేక కథనం.

రికార్డు స్థాయిలో కేసులు

రాష్ర్టంలో పెరిగిన కేసులు జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్‌బీ) తాజా నివేదిక ప్రకారం తెలంగాణలో ఎన్‌డీపీఎస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2023లో రాష్ట్రవ్యాప్తంగా 1,487 డ్రగ్ కేసులు నమోదు కాగా, అది 2024 నాటికి 2,183 కేసులకు చేరింది. ఇందులో 1,282 కేసులు సొంతంగా డ్రగ్స్ వాడుతూ దొరికిన వారివి కాగా, 901 కేసులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ట్రాఫికర్లపై నమోదయ్యాయి. హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో డ్రగ్స్ కేసులు ఏడాదిలోనే 36.6 శాతం మేర పెరిగాయి.

కేవలం గంజాయే కాకుండా కొకైన్, ఎల్‌ఎస్‌డీ వంటి ఖరీదైన సింథటిక్ డ్రగ్స్ కేసులు కూడా పెరుగుతున్నాయి. 2023లో తెలంగాణలో ఎన్‌డీపీఎస్ విభాగంలో 1,487 కేసులు నమోదు కాగా 2024-25 నాటికి 2,183 కేసులు నమోదై 46 శాతం వృద్ధి చెందాయి. హైదరాబాద్ సిటీలో 259 కేసులు నమోదు కాగా 2024--25లో 347 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ పరిధిలో 2023లో 954 మంది అరెస్టు కాగా 2024--25లో 1,228 మంది అరెస్టు అయ్యారు. అంటే 36.6 శాతం వృద్ధి చెందినట్లు గణాంకాలు చెపుతున్నాయి. 

మాఫియా కారిడార్‌గా మెదక్ జిల్లా 

హైదరాబాద్ మహానగరానికి ఆనుకుని ఉండి, జాతీయ రహదారుల కూడలిగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లా ఇప్పుడు అంతర్రాష్ట్ర డ్రగ్స్ మాఫియాకు ప్రధాన రవాణా కారిడార్‌గా మారుతోంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు గంజాయి తరలించేందుకు స్మగ్లర్లు ఈ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకుంటున్నారు. కేవలం రవాణాయే కాకుండా, జిల్లాల పరిధిలోని ఫార్మా హబ్‌దీతిజిజిలు, రహస్య ప్రాంతాలలో ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్స్, మెఫెడ్రోన్, అల్ప్రజోలం తయారీ స్థావరాలు బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

చేగుంట పరిధిలో ఒక రోడ్‌సైడ్ దాబా వెనుక నడుస్తున్న అతిపెద్ద డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ఎలైట్ యాక్షన్ గ్రూప్, స్థానిక పోలీసులు సంయుక్తంగా బస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట జాతీయ రహదారిపై ఒడిశా నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న 574 కేజీల ఎండు గంజాయిని సంగారెడ్డి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పట్టుకుంది. కర్ణాటకలోని బీదర్ సరిహద్దుల నుండి సంగారెడ్డిలోకి అక్రమంగా తరలిస్తున్న 30 కేజీల గంజాయిని సరిహద్దు తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు.

బీహెఈఎల్ (రామచంద్రాపురం) ఇన్‌స్టాల్ చేసిన హైడ్రోపోనిక్ కల్టివేషన్ గంజాయి నెట్‌వర్క్‌ను ఈగల్ ఫోర్స్ ఇక్కడే చేధించింది. జూన్ మొదటి వారంలో బీహెచ్‌ఈఎల్ బస్‌స్టాప్ పరిసరాల్లో నిరంతరం నిఘా పెట్టి పెడ్లర్లను అరెస్ట్ చేస్తున్నారు. టీ కారిడార్‌కు సమీపంలో ఉండే ఈ ప్రాంతంలో హైదరాబాద్ నుండి గంజాయి తెచ్చి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, యువతకు సరఫరా చేస్తున్న నలుగురు స్థానిక పెడ్లర్లను కొల్లూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

మెదక్ టౌన్‌లో అల్ప్రజోలం డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిన ఒక మాజీ ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ కు చెందిన రూ.4.5 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో చట్టబద్ధంగా సీజ్ చేసింది. పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా గిరాకీ ఉన్నంత కాలం సరఫరా జరుగుతూనే ఉంటుంది. పిల్లల ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చే మార్పులను గమనించడం తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ప్రాథమిక బాధ్యత. దీనిని ఒక సామాజిక మహమ్మారిగా గుర్తించి ప్రతి ఒక్కరూ పోరాడాలి.

చాక్లెట్లు, బిస్కెట్లలో మత్తు

గతంలో డ్రగ్స్ రహస్యంగా చేతులు మారేవి. కానీ ఇప్పుడు ముఠాల వ్యూహం మార్చాయి. స్కూల్ వ్యాన్లు, అంబులెన్సులు, పండ్ల బండ్లను రవాణాకు వాడుకుంటున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘యాంటీ-డ్రగ్ అవేర్‌నెస్ వీక్’ సదస్సులో తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ.. పెడ్లర్లు చిన్న పిల్లలను, పాఠశాల విద్యార్థులను వ్యసనపరులుగా మార్చడానికి చాక్లెట్లు, బిస్కెట్లలో నార్కోటిక్స్ మిక్స్ చేసి విక్రయిస్తున్నారని, ఇది ముమ్మాటికీ దేశద్రోహం అని హెచ్చరించారు.

కేవలం ఒడిశా, ఆంధ్ర సరిహద్దుల (ఏవోబీ) నుంచి వచ్చే గంజాయే కాకుండా, కెమికల్ డ్రగ్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకునే వారిలో తెలంగాణ సంఖ్య దేశంలోనే 5వ స్థానంలో (64 వేల మంది) ఉంది. భ్రమలు కల్పించే ‘హాలూసినోజెన్స్’ వాడకంలో రాష్ర్టం 3వ స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి కొరియర్ల ద్వారా చట్టవిరుద్ధంగా లక్షలాది అల్ప్రజోలం మాత్రలను తరలిస్తూ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కు దొరికిపోతున్నారు.

ఇటీవల మౌలాలీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఎన్‌సీబీ జరిపిన దాడిలో రూ.17.40 కోట్ల విలువైన 69 కేజీల అల్ప్రజోలం పట్టుబడటం దీని తీవ్రతకు అద్దం పడుతోంది. మత్తును నిర్మూలించేందుకు తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ సమర శంఖం పూరించాయి. రాష్ర్టంలోని ప్రతి పాఠశాల, కళాశాలలో తప్పనిసరిగా యాంటీ-డ్రగ్ అండ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సరికొత్త జీవో జారీ చేస్తోంది. ఈ నిబంధనలు పాటించని విద్యాసంస్థల గుర్తింపును విద్యాశాఖ నేరుగా రద్దు చేస్తుంది.