9 July, 2026 | 2:14 AM

వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం

09-07-2026 01:24 AM

ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి, జూలై 8 (విజయక్రాంతి): పేదలు, రైతులు, బలహీన వర్గాల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని పెద్దపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు అన్నారు. బుధవారం వైఎస్సార్ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద, అలాగే సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మొదటి వార్డు సుగ్లాంపల్లిలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు, వైఎస్సార్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయరమణ రావు మాట్లాడుతూ.. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు కేవలం అభివృద్ధి పనులు మాత్ర మే కావని, అవి ఆయనకు ప్రజలపై ఉన్న ప్రేమకు, దూరదృష్టికి నిదర్శనాలని కొనియాడారు.

వైఎస్సార్ పాలనలోని ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, 108 సేవలు, పేదవాడి ప్రాణాలు నిలిపిన సంజీవిని అని, ఫీజు రీయింబర్స్మెంట్ తో పేద విద్యార్థులకు ఉన్నత చదు వులను చేరువ చేసిన ఘనత అని, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, పీవీఎన్‌ఆర్ ఎక్స్ప్రెస్వే, ఔటర్ రింగు రోడ్డు, రాజీవ్ రహదారి వంటి భారీ ప్రాజెక్టులు ఆయన విజన్కు నిదర్శనం అన్నారు. ఇందిరమ్మ ఇళ్లుతో నిరుపేదల సొంతింటి కల సాకారం చేసిన అద్భుత పథకమని,ఆ మహానేత ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తి తమకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

ఈ సంస్మరణ కార్యక్రమాల్లో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పట్టణ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని వైఎస్సార్ను స్మరించుకున్నారు.