4 July, 2026 | 5:39 PM

స్వామి వివేకానంద ఆశయాలతో యువత ముందుకు సాగాలి

04-07-2026 04:18 PM

మంథని బీజేపీ పట్టణ అధ్యక్షులు సబ్బని సంతోష్

మంథని,(విజయక్రాంతి) స్వామి వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకుని మంథని యువత తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని భారతీయ జనతా పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 124వ వర్ధంతి సందర్భంగా మంథని పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంథని పట్టణ బీజేపీ అధ్యక్షుడు సబ్బని సంతోష్, పెద్దపల్లి జిల్లా బీజేపీ కౌన్సిల్ సభ్యుడు బోగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వామి వివేకానంద యువతకు శాశ్వత స్ఫూర్తి అని, దేశ అభివృద్ధికి యువతే ప్రధాన శక్తి అని అన్నారు.

యువత అన్ని రంగాల్లో నైపుణ్యం సాధించి దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది యువత మద్యం, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలవడం ఆందోళనకరమని పేర్కొంటూ, యువతలో చైతన్యం పెంపొందించి వివేకానంద జీవిత చరిత్రను అధ్యయనం చేసి ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని సూచించారు.

గోదావరి తీర ప్రాంతమైన మంథని యువత కొత్త ఆలోచనలతో ముందుకు సాగి, స్వస్థల అభివృద్ధికి కృషి చేస్తూ తెలంగాణకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అలాగే మద్యం రహిత, డ్రగ్స్ రహిత మంథని కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పట్టభద్రులైన యువతకు చదువుకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొంటూ, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతకు భరోసా కల్పించాలని కోరారు.