4 July, 2026 | 6:50 PM

విద్యార్థులు నేరాలను ధైర్యంతో ఎండగట్టాలి

04-07-2026 04:59 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): నేరం జరిగినప్పుడు దాని గురించి తెలుసుకున్న విద్యార్థులు ధైర్యంతో ఈ విషయాన్ని పెద్దలకు గాని, అధ్యాపకులకు గాని లేదా 108 కి ఫోన్ చేయడం ద్వారా పోలీసులకు గాని వెంటనే సమాచారాన్ని అందించాలని సీనియర్ సివిల్ జడ్జి నక్కా శ్యాంసుందర్ విద్యార్థులను కోరారు. శనివారం స్థానిక బాలికల గురుకుల కళాశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమయము, ధనము వృధా కాకుండా సత్వర న్యాయాన్ని అందించడం కోసమే న్యా సేవాధికార చట్టం రూపొందించబడిందని, ఈ చట్టం ద్వారా కోర్టును ఆశ్రయించకుండా నాలుగు మార్గాల ద్వారా తమ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చని ఆయన వివరించారు. తెలంగాణలో దిశా చట్టం ద్వారా శిక్షలు కఠినతరం చేయబడ్డాయని అందువల్ల నేర ప్రవృత్తికి విద్యార్థులు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.

మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించబడిన వివాదాలకు చట్టబద్ధత ఏర్పడుతుందని వివరించారు. విద్యార్థినులు శ్రద్ధగా చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. చట్టాల పట్ల విద్యార్థులకు ఉన్న అవగాహనను వ్యాస రూపకంగా రాసి కోర్టుకు పంపించినట్లయితే దాన్ని తాము పరిశీలించి అర్హులైన వారికి తగిన బహుమానాలు అందజేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.మొదట విద్యార్థులు న్యాయమూర్తులను మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికి కార్యక్రమం అనంతరం పాఠశాల అధ్యాపక బృందం వారిని ఘనంగా సత్కరించారు.