రోడ్డు ప్రమాదంలో గాయపడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
గంభీరావుపేటలో విషాదఛాయలు
గంభీరావుపేట, జూలై 21 (విజయ క్రాంతి): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దాదాపు నెలరోజుల పాటు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందిన యువకుడు మంగళవారం కన్నుమూశాడు. ఈ విషాద ఘటన గంభీరావుపేట మండల కేంద్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది.గత నెల జూలై 26న కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కాకులగుట్ట సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న మర్రిచెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న గంభీరావుపేటకు చెందిన ముగ్గురు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కోట అనిల్ ఘటనాస్థలంలోనే మృతి చెందగా, బంగ్లా అనేష్ గౌడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు ప్రాణాలు కోల్పోయాడు.
అదే కారులో ఉన్న గంభీరావుపేటకు చెందిన దుంపల వికాస్ (25) తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. వైద్యులు దాదాపు 25 రోజుల పాటు ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో మంగళవారం ఉదయం వికాస్ మృతి చెందాడు.తన కొడుకు తిరిగి వస్తాడనే ఆశతో రోజులు లెక్కపెట్టిన కుటుంబ సభ్యులకు ఈ వార్త మోసిన దుఃఖం వర్ణించలేనిది. ఆసుపత్రి వద్దే వారి రోదనలు హృదయ విదారకంగా మారాయి. ఒకే ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మరణంలోనూ విడిపోని స్నేహం అంటూ పలువురు కంటతడి పెట్టారు.






