56 రోజుల నిరీక్షణకు ముగింపు...
డీఎన్‌ఏతో గుర్తింపు, కన్నీటి మధ్య ఎముకల అప్పగింత
కోరుట్ల రూరల్, జూలై 21 (విజయ క్రాంతి):కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ మృతిచెంది దాదాపు 56 రోజులు గడిచినా, అతని కుటుంబ సభ్యులకు కనీసం చివరి చూపు కూడా దక్కలేదు. తమ కుమారుడి కోసం రోజుల తరబడి ఎదురుచూసిన ఆ తల్లిదండ్రులకు కాలమే భారంగా మారింది. బీటెక్ విద్యార్థి రాహుల్ గుంటూరు జిల్లా సింగరాయకొండలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
మృత దేహాన్ని అప్పగింతలో జాప్యం జరగగాజులై 7న కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేయడంతో రాహుల్ మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. హై కోర్టు జోక్యంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తమై చర్యలు వేగవంతం చేశాయి. అనంతరం నిర్వహించిన డీఎన్‌ఏ పరీక్షల్లో రాహుల్ కుటుంబ సభ్యుల నమూనాలతో సరిపోలడంతో, అధికారికంగా మృతదేహ అవశేషాల(ఎముకలు)ను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
దీంతో రాహుల్ మృతదేహం మంగళవారం స్వగ్రామానికి చేరుకోగా, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.56 రోజులుగా ఆశలు వదులుకోకుండా న్యాయం కోసం పోరాడిన కుటుంబం, చివరకు తమ కుమారుడి అవశేషాలను స్వీకరిస్తూ కన్నీటి పర్యాంతమైంది. బతికుండగా ఆలింగనం చేసుకోలేకపోయినా, చివరికి ఎముకలను గుండెలకు హత్తుకుని అంత్యక్రియలకు సిద్ధమైంది.ఈ ఘటన ఒక కుటుంబం అనుభవించిన తీవ్ర మానసిక వేదన మాత్రమే కాదు, సమయానికి స్పందించే పరిపాలనా వ్యవస్థ ఎంత అవసరమో కూడా గుర్తు చేసింది. న్యాయం కోసం చేసిన పోరాటం చివరకు ఫలించినా, ఆ కుటుంబం కోల్పోయిన మనిషిని మాత్రం తిరిగి తీసుకురాలేకపోయింది.
* ముమ్మాటికి రాహుల్ ది హత్యే:
సుమరు 56రోజుల క్రితం అనుమానస్పద స్థితిలో మృతి చెందిన రాహుల్ ది ముమ్మాటికి హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.






