22 July, 2026 | 2:28 AM

ఏకీకరణ ఎప్పుడో?

22-07-2026 01:56 AM
  1. ప్రతిపాదనల్లోనే వ్యవసాయ కార్పొరేషన్ల విలీనం 
  2. ఒకే గొడుకు కిందకు తేవాలని రెండేళ్ల క్రితం నిర్ణయం 
  3. శాఖల మధ్య సమన్వయ లోపం 
  4. రాజకీయంగా అభ్యంతరాలు 
  5. వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం  

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): వ్యవసాయ శాఖ అనుబంధ కార్పొరేషన్ల విలీన ప్రతిపాదన ముందుకు సాగడం లేదు. ఆయా సంస్థలు ఒకే తరహా విధులను  నిర్వహించడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందనే అభిప్రాయంతో రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. వీటన్నింటికీ కలిపి ఎండీగా ఐఏఎస్ అధికారిని నియమించాలని నిర్ణయించింది.

అయితే శాఖల మధ్య సమన్వయ లోపం, రాజకీయ ఒత్తిళ్లు, పరిపాలనా కారణాలతో ఈ ప్రక్రియ నిలిచిపోయిందనే చర్చ జరుగుతోంది. వ్యవసాయరంగానికి అనుబంధంగా ఆగ్రోస్, మార్క్‌ఫెడ్, విత్తనాభివృద్ధి, గిడ్డంగుల కార్పొరేషన్, ఆయిల్‌ఫెడ్ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ సంస్థలు రైతుల నుంచి పంటల కొనుగోలు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాల కొనుగోలు-, అమ్మకాలు వంటి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.

వీటితో పాటు మార్కెటింగ్ శాఖ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌లు) కూడా ధాన్యం కొనుగోలు, ఎరువుల పంపిణీ వంటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నాయి. దీంతో ఒకే విధమైన పనులను అనేక సంస్థలు నిర్వహిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొన్ని కార్పొరేషన్లు ఎరువుల విక్రయం, పెట్రోల్ బంకులు, గోదాముల నిర్వహణ వంటి పనులు నిర్వహిస్తున్నాయి. ఇవి తమకు  సంబంధం లేని వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 

రైతులకు మేలు చేసే పనులు చేయాలే తప్ప.. వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడపై ప్రభుత్వం అభ్యం తరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతస్థాయి సమీక్ష కూడా నిర్వహించింది. ఒకే రకమైన పనులను వివిధ కార్పొరేషన్లు నిర్వహిస్తుండటంతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని, రైతులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరడం లేదనే అభిప్రాయం వ్యక్తమైంది.

అంతేకాకుండా కార్పొరేషన్ల మధ్య సమన్వయం లోపించడం వల్ల రైతులు వివిధ సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందకు తెచ్చి, వాటన్నింటికీ ఐఏఎస్ అధికారిని మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించాలని నిర్ణయించింది. కానీ, ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు. 

ముగిసిన చైర్మన్ల పదవీకాలం

ఇదిలా ఉంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం తమ పార్టీకి చెందిన నాయకులను  వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించి రాజకీయ ఉపాధిని కల్పిస్తుంటాయి.  అందులో  ఒక వ్యవసాయ శాఖలోని ఐదారు కార్పొరేషన్లకు చైర్మన్లు ఉంటారు. ప్రధానంగా  సీడ్ కార్పొరేషన్, మార్క్‌ఫెడ్, అగ్రోస్, గిడ్డంగులు, ఆయిల్‌ఫెడ్‌తో పాటు మరికొన్నింటికీ చైర్మన్లుగా అధికార పార్టీ నాయకులను నామినేటెడ్ చేస్తారు.

ఇటీవలనే 37 మంది వరకు నామినేటెడ్ పోస్టుల పదవీ కాలం ముగిసింది. ఈ నెలాఖరులోగా వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తారనే ప్రచారం ఉంది. ప్రభుత్వం ముందుగా భావించినట్లుగా వ్యవసాయ శాఖకు చెందిన అనుబంధ కార్పొరేషన్లను ఒక గొడుగు కింది తీసుకు వస్తుందా? లేక పాత పద్దతినే కొనసాగిస్తుందా? అనేది చర్చనీయంశంగా మారింది.