22 July, 2026 | 3:07 AM

ఇందిరమ్మ ఇళ్లు.. ఎన్నికల స్టంట్!

22-07-2026 02:42 AM
  1. జీహెచ్‌ఎంసీ ఎలక్షన్ కోసమే కాంగ్రెస్ నాటకం 
  2. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ నాటకం ఆడుతుందని, ప్రభుత్వ హామీ కార్యరూపం దాల్చబోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు. క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) చట్టంలో శాస్త్రీయబద్ధమైన పన్నుల విధానం లేదని, ప్రజలపై భారం పడుతుందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్ పరిధిలో నివసిస్తున్న పేద, మధ్యతరగతి వర్గాలపై కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుల భారం మోపుతుందన్నారు. క్యూర్ చట్టంలోని కీలక నిబంధనలు ప్రజలను పీల్చి పిప్పిచేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రీయత లేకుండా, రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఏటా 5 శాతం వరకు పన్నులు పెంచేలా నిబంధనలు పెట్టడం పన్నుల దోపిడీ కోసమేనని ఆరోపించారు. నీరు, సివరేజ్ సేవలను విడదీసి వేర్వేరు పన్నులు విధించడం ద్వారా ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందన్నారు. దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. భాగస్వాములైన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ప్రజల సూచనలు తీసుకోకుండా ఏకపక్షంగా ఈ చట్టం తేవాలనుకోవడం తగదన్నారు.   

దోచుకునేందుకే ఇందిరమ్మ ఇళ్లు

ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల కోసం కాదని, ఆర్థికంగా దోచుకునేందుకు ఉద్దేశించిందని రాంచందర్‌రావు ఆరోపించారు. క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో లక్షలాది మంది అర్హులు ఉంటే, కేవలం 7,680 ప్ల్లాట్లకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదన్నారు. పైగా దరఖాస్తుదారుడి నుంచి రుసుము రూ.100, డిపాజిట్ పేరిట రూ.10 వేల ఈఎండీ (ఈఎండీ) వసూలు చేయడం అన్యాయమన్నారు. ఈ ప్రక్రియ ద్వారా పేదల నుంచి దాదాపు రూ.వెయ్యి కోట్లు వసూలు చేసే కుట్ర జరుగుతుందన్నారు. ఇది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పేరుతో చేసిన డిపాజిట్ల దోపిడీని గుర్తు చేస్తుందన్నరు.

నిధులిస్తున్నది కేంద్రం

మోదీ ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ కింద ఇస్తున్న నిధులు, సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుందని రాంచందర్‌రావు పేర్కొన్నారు. కేంద్ర నిధులను వాడుకుంటూ రూ.11 లక్షల ఇళ్లు ఇస్తున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర మరో నాటకానికి తెరతీసిందన్నారు. కాగా సైనిక్‌పురికి చెందిన ప్రముఖ సేవా నిర్వాహకులు జాయ్ మైఖేల్ డిసాజ్వా, ఓల్డ్ బోయన్‌పల్లికి చెందిన వ్యాపారి దినేష్ కుమార్, కూకట్‌పల్లికి చెందిన వ్యాపారవేత్త శ్రావణ్‌కుమార్ సామలతో పాటు మరికొందరు రాంచందర్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు.