22 July, 2026 | 2:09 AM

కృష్ణపట్టెను కుదిపేస్తున్న గుడుంబా

22-07-2026 01:30 AM
  1. గుట్టుగా తయారీ జోరుగా సరఫరా
  2. పల్లెల నుంచి పట్టణాల దాక విక్రయాలు
  3. రూ.లక్షలు సంపాదిస్తున్న అక్రమార్కులు
  4. మామూళ్ల ‘మత్తు’లో జోగుతున్న ఎక్సైజ్శాఖ

హుజూర్ నగర్, జూలై 21 : సూర్యాపేట జిల్లాలోని కృష్ణపట్టె సరిహద్దు మండలాలోని పల్లెలు,మారుమూల తండాల్లో మళ్లీ గుడుంబా గుప్పుమంటోంది.కొన్నేళ్లుగా స ద్దుమణిగి ఉన్న నాటుసారా తయారీ మళ్లీ పుంజుకుంటోంది. గుడుంబా తయారీదారులు గుట్టుచప్పుడు కాకుండా తయారు చే సి రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ దందా సాగిస్తున్నారు.

మద్యం ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజ లు నాటుసారా వైపు మల్లుతున్నారు. గుడుంబాను నిరోధించాల్సిన సంబంధిత ఎక్సై జ్ అధికారులు మూలాలపై దృష్టి పెట్టకుం డా అడపాదడప దాడులు చేస్తూ అమ్మకం దారులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే విమర్శలు ప్రజల నుండి వస్తున్నాయి.

గతంలో గుడుంబా తయారు చేసేవాళ్లకు రా ష్ట్ర ప్రభుత్వం పునరావాసం కల్పిస్తూ పలు పథకాలను అమలు చేసింది. అయినప్పటికీ కొందరు గుడుంబా కాయడమే వృత్తిగా పె ట్టుకుని పల్లెలో, తండాల్లో జోరుగా దందా ను సాగిస్తున్నారు.గుడుంబా కేవలం పల్లెలు, తండాలకే పరిమితం కాకుండా ఇప్పుడు పట్టణాలకు సైతం పాకింది.

జోరుగా నాటుసారా తయారీ...

హుజూర్ నగర్ నియోజకవర్గంలోని కృ ష్ణపట్టే సరిహద్దు మండలాల్లో నాటుసారా తయారీ జోరందుకుంది.మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు తక్కువ ధరలో లభించే గుడుంబా వైపు మరులుతున్నారు. దీంతో పల్లెలతో పాటు పట్టణాల్లోనూ సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సారా విచ్చలవిడిగా తయారవుతోంది. గుట్టుచప్పుడు కాకుండా ప్లాస్టిక్ కవర్లలో నింపి రవాణా చేస్తున్నారు.

మఠంపల్లి, పాలకీడు, చింతలపాలెం, మేళ్లచెరువు కృష్ణ పట్టె సరిహద్దు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో గుడుంబా తయారీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ద్విచక్ర వాహనాలపై ఇతర గ్రామా లు, పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. కొం దరు సారా తయారీనే వృత్తిగా మలుచుకొని పెద్దఎత్తున తయారు చేసి అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో గుడుంబా తయారీ పెద్దఎత్తున సాగేది.

అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం తయారీకి అడ్డుకట్ట వేయడానికి బెల్లం తయారీని నిషేధించింది. దీంతో సారా తయారీకి అలవాటు పడిన కు టుంబాలకు వివిధ ఉపాధి అవకాశాలు కల్పించారు. అనంతరం వారు సారా తయారీ మానుకునేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో తిరిగి సారా గుప్పు మంటోంది. కొందరు తమ కోసం ఇప్పపువ్వు తో మేలి రకం సారా తయారు చేసుకుని తాగుతుండగా మరికొందరు ఇప్పపువ్వుతో పాటు బెల్లం, కుళ్లిన అరటిపండ్లు, ఇతర మత్తు ప దార్థాలతో గుడుంబా తయారు చేసి దందా సాగిస్తున్నారు.

మందుబాబులు నాటుసారా వైపు మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన కొందరు మత్తు కోసం సారాకు అలవాటు పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మ ద్యం తాగాలంటే వందల రూపాయలు వె చించాల్సి వస్తోంది.

క్వాటర్ మద్యం కొనాలన్నా సుమారు రూ.200కు పైగానే ఖర్చవు తుంది.ఇలాంటి సమయంలో తక్కువ ధరలో దొరుకుతున్న గుడుంబా తాగేందుకు మందుబాబులు మొగ్గుచూపుతున్నారు. రోజువారి కూలీ పనులు చేసుకుని బతికేవా రు చాలా మంది గుడుంబా తాగుతున్నట్లు సమాచారం.

గుడుంబాపై నిఘా కరువు..

జిల్లాలో నిషేధిత గుడుంబాపై ఎక్సైజ్శాఖ ప్రత్యేక నిఘా పెట్టలేకపోతుందనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల హుజూర్ నగర్ నియోజకవర్గంలోని కృష్ణపట్టె మండలాలలో గుడుంబాను తరలిస్తూ పట్టుబడు తున్న సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ప్రధానంగా నాటుసారా తయారు చేసే మూలాలపై సంబంధిత శాఖ అధికారులు దృష్టిసారించకపోవడంతో విచ్చలవిడి గా నాటుసారా తయారవుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది.

సారా అమ్మకాలు ఆ గాలంటే తయారీ మూలాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గుట్టుగా తయారీ చేస్తూ వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. కొందరు తక్కువ సమయంలో ఎక్కు వ డబ్బులు సంపాదించాలనే దురాశతో గుడుంబాను పెద్ద ఎత్తున తయారు చేస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షాకాలం సీజన్ కావడంతో పంట చేన్ల వద్ద గుట్టుగా తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అప్పుడప్పుడు ఎక్సైజ్ అధికారులు తండాలపై దాడులు నిర్వహిస్తున్నారు.

అయితే మూలాలను వెతకకుండా ఎక్కడో ఒకచోట దాడులు నిర్వహిస్తే ప్రయోజనం ఉండదని పలువురు అనుకుంటున్నారు సారా ఎక్కడ తయారు చేస్తున్నారో గుర్తించి పక్కా వ్యూహంతో దాడులు చేస్తేనే అసలు తయారీదారులు దొరుకుతారని కాబట్టి ఎక్సైజ్ అధికారులు ఆ దిశగా అడుగులు వేసి కుటుంబానికి అడ్డుకట్ట వేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

అయితే కృష్ణపట్టె సరిహద్దు మండలాలలో ఇటీవల వరుసగా పట్టుబడుతున్న గుడుంబాను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యల గురించి ఎక్సైజ్శాఖ హుజూర్ నగర్ సీఐనీ మొబైల్లో అడిగే ప్రయత్నం ఎన్నిసార్లు చేసినప్పటికీ ఆయన అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.