22 July, 2026 | 3:04 AM

కళ్లు తెరిచిన కాంగ్రెస్!

22-07-2026 02:25 AM
  1. వీధుల్లోకి ఎక్కి.. చాటిన సత్తా
  2. ప్రధాన స్రవంతి మీడియాపై యువత మండిపాటు
  3. ‘గోదీ మీడియా’ అంటూ జెన్ జీ తిరుగుబాటు బావుటా!
  4. పక్షపాత కవరేజీపై తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ కావడంపై కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఇన్నాళ్లు చేస్తున్న ఆందోళనను కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు అందిపుచ్చుకుంది. పార్లమెంట్  వర్షాకాల సమావేశాలు జరుగుతున్న వేళ.. ప్రశ్నాపత్రాల లీక్‌పై ఏకంగా ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వీధి పోరాటాలకు దిగింది.

మంగళవారం  ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ మెరుపు ధర్నాకు దిగడం ఆ పార్టీకి ఊపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం యువత ఆందోళన ప్రారంభించి పార్లమెంట్ భవనం వైపు దూసుకురావడం సంచలనమైంది. పార్లమెంట్‌ను రెండు రోజులుగా స్థంభింపజేసిన ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నాయి. యువత సమస్యలపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి వీధుల్లోకి రావడం ఆ పార్టీకి కలిసివచ్చే అంశంగా ఉంది.

ఇలా వుండగా, ప్రధాన స్రవంతి మీడియా తమ ఆందోళనను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవని యువత ఆక్రోశిస్తున్నది. సోమవారం ఢిల్లీలోని చారిత్రాత్మక జంతర్ మంతర్ ప్రాంగణం బొద్దింక మాస్కులు ధరించి, వ్యంగ్యాస్త్రాలతో కూడిన ప్లకార్డులు పట్టుకున్న వేలాది మంది యువతీ యువకులతో కిక్కిరిసిపోయింది. దేశంలోని ప్రధాన స్రవంతి టెలివిజన్ మీడియా వాస్తవాలకు దూరంగా ఉంది అని వారు తమ నినా దాలతో స్పష్టంగా చాటిచెప్పారు.

ప్రశ్నపత్రాల లీకేజీలు, వ్యవస్థాగత నిరుద్యోగం, ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తన మొదటి భారీ ప్రత్యక్ష నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోలుస్తూ ఒక న్యాయమూర్తి చేసినట్లుగా ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలను నిరసిస్తూ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ప్రారంభమైన ఈ ఉద్యమం, చూస్తుండగానే రోడ్డెక్కి భారీ నిరసన ప్రదర్శనగా మారింది. ఈ పరిణామంతో సాంప్రదాయ మీడియా కేవలం పరిశీలక పాత్రకే పరిమితమై, యువత ఆగ్రహానికి ప్రధాన లక్ష్యంగా మారింది.

పదిహేను నుంచి ఇరవై ఐదేళ్ల లోపు వయసున్న వేలాది మంది విద్యార్థులు కెమి స్ట్రీ పుస్తకాలు, జాతీయ జెండాలు, పువ్వులు, మీమ్స్ ప్లకార్డులతో నిరసన స్థలానికి చేరుకున్నారు. నీట్- యూజీ తో పాటు ఇతర పోటీ పరీక్షలలో పదేపదే జరుగుతున్న అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నిరుద్యోగానికి పరిష్కారం చూపాలని, వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

అయితే, ఈ డిమాండ్లతో పాటు ప్రధాన స్రవంతి మీడియా పట్ల వారి లో పేరుకుపోయిన అపనమ్మకం స్పష్టంగా బయటపడింది. ‘గోదీ మీడియా హై హై, గోదీ మీడియా గో బ్యాక్, మీడియా వాళ్లు బయటకు వెళ్లండి’ అంటూ నిరసనకారులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రముఖ టీవీ ఛానళ్ల ప్రతినిధులను నిరసనకారులు నిలదీయగా.. కొందరు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు నిరాకరించారు. మరికొందరు విలేకరు లను వెనక్కి పంపివేశారు.

మేము ‘గోదీ మీడియా’తో మాట్లాడము అనే మాట నిరసన వ్యాప్తంగా పదేపదే వినిపించింది. అయి తే ఈ నిరసన అన్ని రకాల మీడియాపై కా దని, కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు భావిస్తున్న ఛానళ్లపైనేనని స్వతంత్ర పరిశీలకులు, డిజిటల్ జర్నలిస్టులు పేర్కొన్నారు.

నిరసనలకు అతీతంగా...

ప్రధాన నిరసన జరిగిన రోజు సాయం త్రం, అమెరికా నుంచి తిరిగి వచ్చిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. మీరు మా సోషల్ మీడియా పోస్టులను డిలీట్ చేయగలరేమో కానీ, మమ్మల్ని తుడిచిపెట్టలేరు అని ధైర్యా న్ని నింపారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఉద్యమంలో పాల్గొనడం, నిరాహార దీక్షలు చేపట్టడం ఉద్యమానికి మరింత గుర్తింపును, బలాన్ని తెచ్చాయి.

రాత్రివేళల్లో ధర్నాలు, బాధ్యతగల పాలన కావాలనే డిమాండ్లతో నిరసనలు కొనసాగాయి. మీడియా సిబ్బందిపై యువత చూ పిన ఆగ్రహం అసౌకర్యంగా అనిపించినప్పటికీ, అది ప్రజాస్వామ్య బలానికి ఒక సూ చిక. సోషల్ మీడియా యుగంలో, జెన్ జీ తమ గొంతుక ద్వారా మరియు డిజిటల్ ఫీడ్ల ద్వారా తమ నిరసనను వ్యక్తం చేస్తోంది. ఇది దీర్ఘకాలిక రాజకీయ మార్పుకు దారితీస్తుందో లేదో వేచి చూడాలి. ఏది ఏమైనా, ఒక తరంలో వస్తున్న మార్పు మా త్రం స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రజల నాడిని విస్మరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. జంతర్ మంతర్ కేవ లం ఒక నిరసన ప్రదేశంగా మాత్రమే కాకుండా.. యువత ఆకాం క్షలకు, పాలకులు,  మీడియా వ్యవస్థాగత వైఫల్యాలకు అద్దంలా నిలిచింది. క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రసారం చేయండి.. లేదంటే ప్రజలు మిమ్మల్ని చూ డటం ఆపివేస్తారని ప్రధాన స్రవంతి మీడియాకు జెన్‌జీ ఇస్తున్న సందేశం మాత్రం స్పష్టంగా ఉంది.

మారుతున్న తరం.. 

జంతర్ మంతర్‌లో జరిగిన సీజేపీ నిరసన.. సాంప్రదాయ మీడియా వ్యవస్థలో వచ్చిన ఒక పెద్ద చీలికను ఎత్తిచూపింది. ఒకప్పుడు ప్రజాభిప్రాయాన్ని శాసించిన టెలివి జన్ మీడియా.. ఇప్పుడు యువత నడిపించే వికేంద్రీకృత కంటెంట్‌తో పోటీ పడుతోంది. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు, యూట్యూబర్లు మరియు స్వతంత్ర జర్నలిస్టులు అక్కడ ప్రత్యక్షంగా ఉంటూ పరిస్థితులను ఎటువంటి ఫిల్టర్లు లేకుండా చిత్రీకరించారు.

బొద్దింక మాస్కు లు వేసుకున్న విద్యార్థులు ప్లేట్లను గరిటెలతో కొడుతూ వినూత్న నిరసన తెలపడం, ప్లకార్డులపై ఉర్దూ కవిత్వం, బాలీవుడ్‌ను జోడి స్తూ చేసిన రాజకీయ మీమ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. జెన్ జీ మార్పును కోరుకుంటోందా లేదా? అని టీవీ ఛానళ్లు స్టూడియోలలో చర్చలు జరుపుతున్న సమయం లో.. అదే జెన్ జీ రోడ్లపైకి వచ్చి స్వయంగా ఆ మార్పును సృష్టిస్తోందని ఒక నిర్వాహకుడు వ్యాఖ్యానించారు.

బీహార్, మధ్యప్ర దేశ్, మహారాష్ట్ర వంటి వివిధ రాష్ట్రాల నుండి విద్యార్థులు ఈ ప్రదర్శనకు తరలివచ్చారు. అనేకమందికి ఇది మొదటి ప్రత్యక్ష నిరసన. కేవలం నీట్ లీకేజీలకే పరిమితం కాకుండా, ద్రవ్యోల్బణం, ఐటీతోపాటు ఇతర రంగాలలో ఉద్యోగాల కొరత, పాలకులు కేవలం ప్రచారానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆందోళనలను వారు వ్యక్తం చేశారు. అయితే, ఈ ఉద్యమం రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థపరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని, అన్ని మీడియాలు పక్షపాతంతో లేవని (కొన్ని ఛానళ్లు ప్రాధాన్యతనిచ్చి కవర్ చేశాయని) నిరసనకారులను విమర్శించేవారు పేర్కొన్నారు. 

ఆగ్రహానికి మూలాలు.. 

ప్రధాన స్రవంతి టీవీ ఛానళ్లు సాధారణ పౌరుల నిత్య జీవిత సమస్యలను పక్కనపెట్టి, అధికార పక్ష వాయిస్ గా మారిపోయాయనే భావనే ఈ నిరసనలకు ప్రధాన కారణమని యువకులు వెల్లడించారు. ఒకవైపు ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు జంతర్ మంతర్ నుంచి ప్రత్యక్ష ప్రసారాలు, డ్రోన్ దృశ్యాలు మరియు విద్యార్థుల వ్యక్తిగత కథనాలతో నిండిపోగా...

జాతీయ టీవీ ఛానళ్లు మాత్రం కర్ణాటక రాజకీయాలు, గ్రౌండ్ రిపోర్ట్ లేని విద్యా రంగా చర్చలు, సంబంధం లేని ఇతర అంశాలకే ప్రాధాన్యత ఇచ్చాయి. ఫరీదాబాద్‌కు చెందిన సమీక్ష అనే యువతి కెమిస్ట్రీ పాఠ్యపుస్తకాన్ని చేతిలో పట్టుకుని (నిరసన తీవ్రతరం కాకముందు) మాట్లాడుతూ.. జెన్ జీ దేన్నైనా సాధించగలదు.

సోషల్ మీడియా మమ్మల్ని ఐకమత్యంగా ఉంచుతోంది. కానీ టీవీ మీడియా ఉందా? ప్రభుత్వం ఏం కోరుకుంటుందో దాన్నే చూపుతోంది. లీకేజీల వల్ల మా బాధలు, ఆత్మహత్యలు, కోల్పోయిన ఏళ్లు, నాశనమైన మా కలలను వారు పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలకు అక్కడ ఉన్న యువత నుంచి విశేష మద్దతు లభించింది.