22 July, 2026 | 2:26 AM

రైతు డిక్లరేషన్ ఏమైంది?

22-07-2026 02:07 AM
  1. నాలుగుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన ప్రభుత్వమిది 
  2. కాంగ్రెసోళ్లను ఉరికిచ్చి కొడితేనే రైతులకు న్యాయం 
  3.   32 నెలలు దాటినా కాళేశ్వరం రిపేర్ చేయరా? 
  4. మంచిర్యాల ఎమ్మెల్యే హద్దులు దాటొద్దు 
  5. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 
  6. మంచిర్యాల రైతుల కుటుంబాలకు చెక్కులు అందజేత

లక్షెట్టిపేట, జూలై 21: సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని, రైతులు చనిపోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎన్నికలకు ముందు చెప్పిన వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. 32 నెలలు దాటినా ఇప్పటికీ రైతులకు న్యాయం చేయడం లేదని, కాళేశ్వరం మరమ్మతులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

నాలుగుసార్లు రైతు బంధు ఎగ్గొట్టిన సీఎం రేవంత్ ప్రభుత్వానికి, రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం అంకత్‌పల్లిలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన రైతు సదస్సుకు ఆయన హాజరయ్యారు. పిడుగుపాటుతో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించి పార్టీ తరఫున రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

రైతులు సచ్చిపోతున్నా రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు చెప్పిన వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. 32 నెలలు దాటినా ఇప్పటికీ రైతులకు న్యాయం చేయడం లేదని, కాళేశ్వరం మరమ్మతులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టులను బాంబులతో పేల్చిన వారికి సాగునీటి విలువ ఎలా తెలుస్తుందని విమర్శించారు. నిరుద్యోగులకు రేవంత్ దొరికితే ఉరికిచ్చి కొడుతారని ఎద్దేవా చేశారు.

సీఎం రేవంత్‌కు రెండే తెలుసునని ఒకటి ఓట్లు.. రెండు తిట్లు అని ఎద్దేవా చేశారు. మాది ఏ జాతి అని ప్రశ్నించే రేవంత్‌కు మేమిచ్చే సమాధానం ఒక్కటే, మాది తెలంగాణను ప్రేమించే జాతి అని స్పష్టం చేశారు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన జాతి నీదని, ఎమ్మెల్యేలను నోట్లతో కొనే జాతి నీదని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజలకు వివరించారు.

రైతుల పంటలను కొనుగోలు చేయరు, గిట్టుబాటు ధర ఇవ్వరు, యూరియా కోసం అనేక కష్టాలను రైతులు పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పని తీరు అని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రకాల అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నేడు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందన్నారు. వర్షానికి గోడ కూలీ రైతులు మరణిస్తే నేటికీ ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించలేదని విమర్శించారు.

‘కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు, కరెంటు కోతలు, సాగునీటి అవస్థలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ పాలనలో నిరంతరాయంగా విద్యుత్, సమయానికి రైతుబంధు అందేవి. వ్యవసాయంలో పంజాబ్ను తలదన్నే రీతిలో తీర్చిదిద్దారు. కాళేశ్వరంతో కేసీఆర్‌కు పేరొస్తుందనే ఆ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఒకరోజు నీరు లేవంటారు.. రెండో రోజు మరో కథ చెపుతారు. ఇది కాలం తెచ్చిన కరవు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు’ అని విమర్శించారు. 

మంచిర్యాల ఎమ్మెల్యే వేధింపులను సహించం

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వేధింపులను సహించేది లేదని, ఎమ్మెల్యే తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రజా సంక్షేమం గురించి మీ ముఖ్యమంత్రిని అడిగి అభివృద్ధి పనులు చేయండి, అనవసరంగా మా పార్టీ నాయకుల, కార్యకర్తల జోలికి రావద్దన్నారు.

కార్యక్రమంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, జీవన్‌రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మీ, సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి, సుంకే రవి, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, మాజీ ఫిల్మ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ రామ్మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదా సు లక్ష్మణ్‌రావు, రాష్ట్ర నాయకులు విజిత్‌రావు, మాజీ డీసీఎమ్మెస్ తిప్పని లింగయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ లు ఎల్తాపు సుధాకర్, మాజీ సర్పంచ్ సొల్లు సురేష్, మాజీ యూత్ అధ్యక్షులు మారిశెట్టి సుమన్ పాల్గొన్నారు.