23 August, 2026 | 3:06 AM

సెటిల్‌మెంట్ల రాజ్యం

23-08-2026 01:33 AM
  1. కాంగ్రెస్ పాలనలో భూదందాలు 
  2. భూభారతిపై న్యాయ విచారణ జరిపించాలి 
  3. పీనుగలు తినేవాడు పోయి.. ఏనుగులు తినేవాడు వచ్చినట్లుంది 
  4. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్‌లో హైదరాబాద్ విమోచన దినోత్సవం 
  5. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో భూ దందాలు, సెటిల్‌మెంట్ల రాజ్యం నడుస్తుందని కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. భూభారతి పేరిట లక్షలాది ఎకరాల ప్రైవేటు భూములను 22 ఏ నిషేధిత జాబితాలోకి చేర్చి దందా నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన కార్డులపై కేంద్ర ప్రభుత్వ లోగో ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. రూ. 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు.

నిజాం పాలన నుంచి విముక్తి పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ (హైదరాబాద్ ముక్తి దివస్) అధికారికంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పారామిలిటరీ కవాతు, తెలంగాణ కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయని తెలిపారు.

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు దశాబ్దాలుగా ఈ ఉత్సవాలను అధికారికంగా జరుపుతుంటే, తెలంగాణలో మాత్రం గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు మజ్లిస్ పార్టీ భయంతో, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే అధికారికంగా నిర్వహించకుండా చరిత్రను తొక్కిపెట్టాయని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ పాలనలో ధరణి ద్వారా జరిగిన భూ అక్రమాలను సముద్రంలో పడేస్తామ ని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ‘భూభారతి’ పేరు తో అంతకంటే తీవ్రమైన దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు.

పీనుగలు తినేవాడు పోయి ఏనుగులు తినేవాడు వచ్చినట్లు పరిస్థితి తయారైందన్నారు. కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే సుమారు 4 లక్షల ఎకరాల భూములను రాత్రికి రాత్రే అక్రమంగా 22ఏ (నిషేధిత జాబితా)లోకి చేర్చారని మండిపడ్డారు. 

ప్రభుత్వ, దేవాదాయ భూ ములు మాత్రమే ఉండాల్సిన 22ఏ లోకి దశాబ్దాలుగా మున్సిపల్ అనుమతులు పొంది, పన్నులు కడుతూ నివాసముంటున్న ప్రైవేటు ఇళ్లు, స్థలాలను ఉద్దేశపూర్వకంగా చేర్చి సెటిల్మెంట్ల పేరిట 50 శాతం వాటాలు, భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. హైడ్రా కూడా పేదవాడికి ఒక న్యాయం, మజ్లిస్ నేతలకు మరో న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తోందన్నారు. 

బాధితులకు ఉచిత న్యాయసాయం..

తెలంగాణ ప్రజల ఆస్తులు భద్రంగా ఉండాలంటే ఆర్మీని దింపాల్సి వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చన్నారు. గత 2-3 ఏళ్లలో 22 ఏలో చేర్చిన, తొలగించిన భూములపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

బాధితులకు మం డల స్థాయి నుంచి హైకోర్టు వరకు బీజేపీ లీగ ల్ సెల్ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో కాలేజీలకు చెల్లించాల్సిన సుమారు రూ. 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై అసత్య ప్రచారాలు..

ముఖ్యమంత్రులు లేదా మంత్రుల అధికారిక విదేశీ పర్యటనలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ దౌత్య నిబంధనలు, అంతర్జాతీయ భద్ర తా ప్రోటోకాల్స్ ప్రకారం నిర్ణయం తీసుకుంటుందని, ఇందులో రాజకీయ కక్షసాధింపులు ఉండవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాం నుంచే ఉన్న ఈ నిబంధనల ప్రకారం బీజేపీ మంత్రుల పర్యటనలకు కూడా పలుమార్లు అనుమతులు రాలేదని, దీన్ని రాజకీయం చే యడం తగదని హితవు పలికారు.

పార్లమెంట్ గేట్ల వద్ద జరిగిన ఆందోళనల్లో ఢిల్లీ పోలీసులు ఎంతో సంయమనం పాటించారని, బాధ్యతగల ప్రతిపక్ష నేతగా వ్యవహరించాల్సిన రాహు ల్ గాంధీ యువతను రెచ్చగొట్టేలా మాట్లాడటం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదిని, ఆయన దివంగత మాతృమూర్తిని కించపరిచేలా కొందరు వ్యాఖ్యానించినా, వారిని క్షమించి కేసులు ఉపసంహరించుకున్న గొప్ప మనసు మోదీది అని గుర్తుచేశారు.

గ్రామాల్లో ఓటు నమోదు చేసుకోకపోతే రేషన్ కార్డులు, భూములు, ఆస్తులు, పెన్షన్లు పోతాయని సీఎం చేసిన ప్రకటనల వల్లే ప్రజలు భయపడి హైదరాబాద్ వదిలి వెళ్లారని, దీనివల్ల సికింద్రాబాద్ నియోజకవర్గంలోనే 9.35 లక్షల ఓట్లు తగ్గాయని చెప్పారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద దేశవ్యాప్తంగా పేదలకు కేంద్ర ప్రభుత్వమే 70 శాతానికి పైగా సబ్సిడీ, ధాన్యం కొనుగోలు, రవాణా, డీలర్ల కమిషన్ భరిస్తూ 5 కేజీల ఉచి త బియ్యం అందిస్తోందని తెలిపారు.

దేశంలో ని అన్ని రాష్ట్రాలు కేంద్ర లోగోను ముద్రిస్తుంటే, తెలంగాణలో మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు, భారత ప్రభుత్వ లోగో లేకుండా కేవలం ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫోటోలు మాత్రమే వేసుకోవడం సిగ్గుచేటన్నారు. రేషన్ రశీదుల్లో కేంద్ర వాటా ఉన్నప్పుడు, కార్డులపై కేంద్ర లోగో, ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మ ఎందుకు వేయరని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాన్ని తమదిగా ప్రచారం చేసుకోవడం మానుకోకపోతే, కేంద్రమే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ ఏర్పాట్లను పరిశీలించడమే గాక అందజేస్తుందని హెచ్చరించారు.