ఏడో బ్లాక్‌లోనే లోపాలు!
- మేడిగడ్డ 1, 6, 8 బ్లాకులు ఓకే
- అన్నారం, సుందిళ్లకూ డోకా లేదు
- కాళేశ్వరం కాంక్రీట్ క్వాలిటీపై సీడబ్ల్యూపీఆర్‌ఎస్ నివేదిక
- అన్నారం, సుందిళ్ల అన్ని పియర్స్‌పై విస్తృతంగా పరీక్షలు
- నాణ్యత స్థిరం, సంతృప్తికరమని స్పష్టీకరణ
- కాంగ్రెస్ ఆరోపణలకు భిన్నంగా ఫలితాలు
- ‘కాళేశ్వరం’పై చర్చ కొత్త మలుపు
- ప్రాజెక్టు పూర్తి నివేదికపై ఆసక్తి
హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి) : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ నాణ్యతపై కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్‌ఎస్ మధ్య కొనసాగుతున్న రాజకీయ పోరులో కేంద్ర జల, విద్యు త్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) కాంక్రీట్ నాణ్యత పరీక్షల ఫలితాలు కీలక చర్చకు దారితీస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లు నాసిరకంగా నిర్మించారని, నిర్మాణంలో నాణ్యతా లోపాలే ప్రాజెక్టులో సమస్యలకు కారణమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు పదేపదే ఆరోపణలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
అయితే అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై నిర్వహించిన కాంక్రీట్ నాణ్యత పరీక్షల్లో సాను కూల ఫలితాలు రావడం ఇప్పుడు ఆ ఆరోపణలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. అన్నారం బరాజ్‌లోని 72 పియర్స్‌పై పరీక్ష లు నిర్వహించగా వంద శాతం ఎలాంటి నాణ్యతా సమస్యలు లేవని సీడబ్ల్యూపీఆర్‌ఎస్ తేల్చింది. సుందిళ్ల బరాజ్‌లోని ఏడు బ్లా కుల్లో ఉన్న అన్ని పియర్స్‌పై పరీక్షలు నిర్వహించగా కాంక్రీట్ నాణ్యత చాలా బాగుం దని పరీక్షా నివేదికల్లో స్పష్టం చేసింది.
ఇక మేడిగడ్డలోనూ 7వ బ్లాక్ మినహా మిగిలిన ఏడు బ్లాకుల్లో నాణ్యత సమస్యలు లేవని తేలినట్లు సమాచారం. దీంతో ఒక బరాజ్‌లో చోటుచేసుకున్న సమస్యను ఆధారంగా చేసుకుని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్నే నాసిరకంగా చిత్రీకరించారా? అన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తెలంగాణ సాగునీటి రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకుంది.
భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు కీలకం. అయితే 2023లో మేడిగడ్డ బరాజ్‌లోని 7వ బ్లాక్‌లో సమస్య ఏర్పడటంతో ప్రాజెక్టు నిర్మాణ నాణ్యతపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అదే సమయంలో కాంగ్రె స్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై తీవ్ర ఆరోపణలు చేసింది.
ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవకతవకలు, నాణ్యతా లోపాలు జరిగాయని విమ ర్శించింది. కానీ ఇప్పుడు బరాజ్‌ల్లోని పియర్స్‌పై శాస్త్రీయంగా నిర్వహించిన కాంక్రీట్ నాణ్యత పరీక్షలు అందుబాటులోకి వస్తుండటంతో చర్చ మరో మలుపు తిరుగుతోంది.
వేలాది పరీక్షలు.. సానుకూల ఫలితాలు
అన్నారం బ్యారేజీలోని మొత్తం 72 పియర్లపై సీడబ్ల్యూపీఆర్‌ఎస్ అధ్యయనం నిర్వ హించింది. 60,973 యూపీవీ పరీక్షలు, 39,600 రీబౌండ్ హ్యామర్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల ఫలితాల్లో 49.7 శాతం నుంచి 54.5 శాతం వరకు కాంక్రీటు నాణ్యత ‘ఎక్సలెంట్’గా, 45.5 శాతం నుంచి 50.3 శాతం వరకు ‘గుడ్’గా నమోదైనట్లు నివేదిక పేర్కొంది. ముఖ్యంగా బరాజ్‌లోని ఆరు బ్లా కుల్లోనూ కాంక్రీటు నాణ్యతకు సంబంధించి ఎలాంటి సమస్యలు గుర్తించలేదని అధ్యయనం తేల్చింది.
అలాగే సుందిళ్ల బరాజ్‌లో ని ఏడు బ్లాకుల్లో ఉన్న అన్ని పియర్లపై సీడబ్ల్యూపీఆర్‌ఎస్ పరీక్షలు నిర్వహించింది. నా లుగో బ్లాకులో మాత్రమూ సమస్య 1.1 శా తం మేర ఉన్నట్లు కన్సాలిడేటెడ్ నివేదికలో వెల్లడైంది. మొత్తం బరాజ్‌ని పరిగణనలోకి తీసుకుంటే కాంక్రీటు నాణ్యత స్థిరంగా ఉందని సీడబ్ల్యూపీఆర్‌ఎస్ నిర్ధారించింది.
కాంగ్రెస్ ఆరోపణలకు టెక్నికల్ రిపోర్ట్ చెక్ ?
కాళేశ్వరం బరాజ్‌లకు సంబంధించి ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం లేవనెత్తిన అంశాల్లో రాజకీయ ఆరోపణలే ప్రధానంగా కనిపించాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. తాజా నివేదికలో సానుకూల ఫలి తాలు రావడం ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం వ్యవహారం ఇప్పుడు కేవలం ఇంజినీ రింగ్ అంశంగా కాకుండా తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టు కావడంతో ఆ పార్టీకి ఇది రాజకీయ ప్రతిష్ఠకు సంబంధించిన అంశం.
కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం గత ప్రభుత్వంపై అవినీతి, నాణ్యతా లోపాల ఆరోపణలకు ఇది ప్ర ధాన ఆధారంగా మారింది. మరో వైపు కాళేశ్వరంపై కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టే అవకాశం బీఆర్‌ఎస్‌కు లభించింది. సీడబ్ల్యూపీఆర్‌ఎస్ కాంక్రీట్ నాణ్యత పరీక్షల నివేదిక ఆయుధంగా మారనుంది. ఈ నివేదికతో ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. అదే అంశా న్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడికి ఉపయోగించుకోవాలని వ్యూహరచన చేస్తోంది.
మేడిగడ్డలో ఏడో బ్లాక్‌లో మినహా అంతా గుడ్
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్‌లో మొత్తం ఎనిమిది బ్లాకులు ఉన్నాయి. వీటిలో 68 స్పిల్‌వే గేట్లు, 17 అండర్ స్లూయిస్ గేట్లు కలిపి 85 రేడియల్ గేట్లు ఉన్నాయి. ఈ గేట్లకు సంబం ధించిన పియర్లన్నింటిపైనా సీడబ్ల్యూపీఆర్‌ఎస్ అధ్యయనం చేసింది. 84,800 యూపీవీ పరీక్షలు, 50,400 రీబౌండ్ హ్యామర్ పరీక్షలు నిర్వహించారు. ఇందు లో మొదటి నుంచి ఆరో బ్లాకులు, ఎనిమిదో బ్లాకులో కాంక్రీటు నాణ్యత సమస్య లు లేవని నివేదిక స్పష్టం చేసింది.
అయితే ఆరో బ్లాకులోని 33, 34వ పియర్లలో కొంత భాగంలో కాంక్రీటు నాణ్యతపై సందేహాలు వ్యక్తమైనప్పటికీ, దాదాపు 95 శాతం అనుకూల ఫలితాలు వచ్చాయి. మొత్తానికి కాంక్రీటు నాణ్యత సంతృప్తికరంగానే ఉందని నివేదిక పేర్కొంది. అయి తే ఏడో బ్లాకులో కాంక్రీటు నాణ్యతపై సందేహాలుండటంతో ఈ బ్లాక్‌లోని కొన్ని పియర్లను మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరాన్ని సీడబ్ల్యూపీఆర్‌ఎస్ సూచించింది.
ఏడో బ్లాక్‌లో మొత్తం 11 పియర్లు ఉండగా, వీటిలో 12 నుంచి 15 వరకు, 22వ పియర్‌లో నాణ్యత మెరుగ్గా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. 19వ పియర్‌లో 73.3 శాతం, 18వ పియర్‌లో 65.5 శాతం, 20వ పియర్‌లో 61.1 శాతం, 17వ పియర్‌లో 50.5 శాతం, 21వ పియర్‌లో 49.9 శాతం, 16వ పియర్‌లో 41.3 శాతం మేర నాణ్యతపై సందేహాస్పద ఫలితాలు నమోదైనట్లు నివేదికలో పేర్కొ న్నారు. దీంతో ఏడో బ్లాక్‌లో సమసలను గుర్తించిన పియర్లకు సమగ్ర పరిశీలనతో పాటు మరిన్ని అనుబంధ పరీక్షలు నిర్వహించి, వాటి ఆధారంగా పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సీడబ్ల్యూపీఆర్‌ఎస్ సిఫార్సు చేసింది.






