23 August, 2026 | 2:45 AM

వైద్యం అందిందా.. నిర్లక్ష్యమా?

23-08-2026 01:06 AM

మూడు నెలల పసికందు మృతిపై దుమారం

గద్వాల: గద్వాల జిల్లాలో వైద్య సేవల తీరుపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మూడు నెలల చిన్నారి వాంతులతో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లినారు. మరుసటి రోజు పరిస్థితి విషమించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందడం కలకలం రేపింది. చిన్నారి మృతికి ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధిత కుటుంబం, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గద్వాల మండలం చేనుగొనిపల్లి గ్రామానికి చెందిన హరీష్,శ్రావణి దంపతుల మూడు నెలల చిన్నారికి గురువారం వాంతులు కావడంతో గద్వాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం చిన్నారిని ఇంటికి తీసుకెళ్లాలని సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.అయితే శుక్రవారం చిన్నారికి మళ్లీ వాంతులు కావడంతో అదే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈసారి వాంతులతో పాటు ఆయాసం కూడా రావడంతో పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంటూ గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న అనంతరం వైద్యులు చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు చిన్నారి మృతదేహంతో ప్రైవేటు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.చిన్నారికి సకాలంలో సరైన వైద్యం అందించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆసుపత్రుల తీరుపై ఆగ్రహం

చిన్నారి మృతితో స్థానికులు,బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.పేద,మధ్యతరగతి కుటుంబాలు వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్తే నాణ్యమైన వైద్యం అందకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ఘటనపై సమగ్ర విచారణ జరిపి,నిర్లక్ష్యం తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.చిన్నారి మృతి ఘటనపై అధికారులు స్పందించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.