పొంగల్‌కు పోటాపోటీగా..!
- ఇప్పట్నుంచే రిలీజ్ డేట్ల ప్రకటన
- పెరుగుతున్న సంక్రాంతి సినిమాల సంఖ్య
* ఈరోజు మెగాస్టార్, మొన్న వెంకీ మామ, అంతకుముందు శర్వానంద్, సాయిదుర్గ తేజ్.. ఇలా ఒక్కొక్కరూ రిలీజ్ డేట్లు ప్రకటిస్తూ సంక్రాంతి సీజన్‌కు బెర్త్ కన్‌ఫర్మ్ చేసుకుంటున్నారు. ఔను, టాలీవుడ్‌లో సంక్రాంతి సినిమాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2027 సంక్రాంతి బరిలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అగ్ర కథానాయకుల సినిమాలు నిలవబోతున్నాయి.
తేదీ ఖరారు చేసిన చిరంజీవి ‘కాకా’..
‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి. బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాను 2027 ముగ్గుల పండక్కి తీసుకురానున్నారు. ఈ సినిమా టైటిల్ ‘కాకా’ అని చిరు బర్త్‌డే సందర్భంగా శనివారం ప్రకటించారు. ఇది జనవరి 13న విడుదల కానుంది. ఈ సినిమాలో చిరంజీవి.. చేపలు, రొయ్యల చెరువుల వ్యాపార సంస్థ సూపర్‌వైజర్‌గా కనిపిస్తారు. ఇది పక్కా మాస్ ఎలిమెంట్స్‌తోపాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో మెగాస్టార్ రెండు విభిన్న గెటప్పుల్లో అలరించనున్నారు.
ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. వెంకట్ కే నారాయణ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా ప్రకటన నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా టైటిల్ గ్లింప్స్ స్టైల్, యాక్షన్, రా మాస్ అప్పీల్‌తో ఆ అంచనాలను మరింత పెంచింది. ఈ వీడియోలో చిరంజీవి పాత్రను ఆక్వా ఇండస్ట్రీలో పనిచేసే సూపర్‌వైజర్ కే సత్యంగా పరిచయం చేశారు.
చిరంజీవి ఇందులో మిడిల్ క్లాస్ అవతార్‌లో యంగ్, స్టైలిష్‌గా కనిపించడం గ్లింప్స్‌నకు మాస్ టచ్ ఇచ్చింది. అనస్వర రాజ న్ కీలక పాత్ర లో నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్; డీవో పీ: విజయ్ కార్తీక్ కన్నన్; యాక్షన్: రామ్ - లక్ష్మణ్, నబకాంత్; డైలాగ్స్: భాను-నందు; ఎడిటర్: ఆంటోనీ రూబెన్; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా.
తెలుగునాట సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది సగటు సినీప్రియులకు గుర్తుకొచ్చేది పండుగ బొమ్మే. ప్రేక్షకుల నాడికి తగ్గట్టు మేకర్స్ కూడా ఆ సీజన్ కోసం తమ సినిమాలను సిద్ధం చేస్తారు. 2027 పొంగల్ సీజన్‌ను టార్గెట్ చేసుకుంటూ ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులు తమ విడుదల తేదీలను ఖరారు చేసుకుంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం సంక్రాంతికి ఎవరెవరు వస్తున్నారో చూద్దాం..
బావ బామ్మర్ది కథతో అనిల్ రావిపూడి..
సంక్రాంతి సెంటిమెంట్ ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం 2027, జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రానికి టైటిల్ కూడా ‘జనవరి 12 విడుదల’ అనే ఖరారు చేశారు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనేది ట్యాగ్‌లైన్. కీర్తి సురేశ్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను షైన్‌స్క్రీన్స్, సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిల్ రావిపూడి మార్క్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.
ఈ సారి ‘జార్జ్ క్రిష్’గా శర్వా..
సంక్రాంతి సీజన్‌లో వచ్చి హిట్ టాక్ అందుకునే హీరోల్లో శర్వానంద్ ఒకరు. ఆయన హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరికొత్త ఎంటర్‌టైనర్ కూడా మరోమారు ఈ సంక్రాంతి రేసులో నిలుస్తోంది. ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా.. శ్రీను వైట్ల మార్క్ కామెడీ, రొమాన్స్‌తో కూడిన టైమ్-ట్రావెల్ ఫాంటసీ కామెడీ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, సంక్రాంతి లోపు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
‘సంబరాల ఏటిగట్టు’తో తేజ్..
హీరో సాయిదుర్గతేజ్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’ (ఎస్‌వైజీ). నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా ఇది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది. ఐశ్వర్య లక్ష్మి, జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ఒక దిగ్గజ బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.
కలిసొచ్చే తారీఖునే ‘కింగ్’..
టాలీవుడ్ ‘కింగ్’గా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు సీనియర్ హీరో నాగార్జున. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం కూడా పండగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని ముస్తాబవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. నాగార్జునకు ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘బంగార్రాజు’ వంటి సంక్రాంతి హిట్స్ ఇచ్చిన తేదీ జనవరి 15 కావడంతో కింగ్ తాజా చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.
అదే సీజన్‌కు మరికొన్ని సినిమాలు..
రవితేజ, -శ్రీవిష్ణు హీరోలుగా దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉంది. సంక్రాంతి రేసులో ప్రచారంలో ఉన్న ఇతర పెద్ద సినిమాల్లో ప్రభాస్ ‘స్పిరిట్’ కూడా ఉంది. సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న ఈ పవర్‌ఫుల్ పోలీస్ డ్రామాను 2027 సంక్రాంతికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ కూడా సంక్రాంతి రేసులోనే ఉండే అవకాశం ఉంది.
అటు సీబీ చక్రవర్తి దర్శకత్వంలో రజనీకాంత్ నటించబోయే చిత్రం కూడా 2027 పొంగల్ విడుదలను ప్లాన్ చేస్తోంది. కార్తి వంటి ఇతర హీరో ల చిత్రాలు కూడా ఈ బాక్సాఫీస్ పోరులో చేరే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో వీటి టైటిల్స్, ఖచ్చితమైన విడుదల తేదీలపై మరిన్ని అధికారిక ప్రకటనలు రానున్నాయి.
బరి నుంచి బాలకృష్ణ ఔట్!
బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఎన్‌బీకే111’. ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడం దాదాపు ఖరారైనట్టేనని తెలుస్తోంది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో బాలకృష్ణ సరసన కథానాయికగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.
అలాగే శరత్‌కుమార్, సముద్రఖని, నర్గీస్ ఫక్రీ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వెంకట సతీశ్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజా సమాచారం ప్రకారం.. కథలో మార్పులు చేస్తున్నారు. మొదట అనుకున్న పీరియడ్ డ్రామా బడ్జెట్ పరిమితుల కారణంగా, మార్కెట్ సమీకరణాల దృష్ట్యా మార్చినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా సరికొత్త మాస్ స్టైలిష్ కథను సిద్ధం చేసి షూటింగ్ ప్రారంభించారు దర్శకుడు గోపీచంద్ మలినేని.
అయితే, ఇటీవల షూటింగ్‌లో బాలకృష్ణ మోకాలికి చిన్న గాయం కావడం వల్ల సర్జరీ జరిగింది. ప్రస్తుతం కోలుకుంటున్న బాలయ్య, సెప్టెంబర్ నుంచి తిరిగి ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ సినిమాను మొదట 2027 సంక్రాంతి రేసులో నిలపాలని భావించినప్పటికీ, మిగతా పెద్ద సినిమాల క్లాష్‌ను నివారించేందుకు, షూటింగ్ వేగంగా ముగించి, ఈ ఏడాది చివర్‌లోనే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిత్రం పూర్తయిన వెంటనే బాలకృష్ణ, కొరటాల శివ దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్టు ‘ఎన్‌బీకే112’ను ప్రారంభించనున్నారు.
నరేశ్ ఆరుట్ల






