దేశ ప్రగతికి సంఘటితంగా పనిచేయాలి
- రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- శ్రీ విద్యాకోటి కుంకుమార్చన మహాయజ్ఞం ప్రారంభం
- దేశం ఎదిగేందుకు ప్రతీ పౌరుడు కృషి చేయాలి
- అభిషేక్ బ్రహ్మచారి మహారాజ్
హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా సనాతన ధర్మ పరిరక్షణ, సమాజ నిర్మాణం, దేశ ప్రగతి కోసం అన్ని వర్గాల ప్రజలు సంఘటితమై పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సభా మందిరంలో ప్రముఖ గురువు అభిషేక్ బ్రహ్మచారి మహారాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ విద్యా కోటి కుంకుమార్చన మహాయాజ్ఞం రెండు రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ శుక్లా మాట్లాడుతూ.. అభిషేక్ మహారాజ్ ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని, దీంతో నవ నిర్మాణ సమాజం సాధ్యమన్నారు.
ప్రపంచస్థాయిలో నేడు బలమైన దేశంగా భారత్ ఎదుగుతుందని, మరింత ఎదిగేందుకు ప్రతీ పౌరుడు కృషి చేయాలని ఆకాంక్షించారు. అభిషేక్ మహారాజ్ మాట్లాడుతూ..సనాతన ధర్మమే అన్నింటికీ, అందరికీ మూలమని, ఈ దారిలో నడిస్తే ప్రగతి ఖాయమన్నారు. రాబోయే రోజుల్లో దేశంలోని ప్రతీజిల్లాలో శ్రీ విద్యా కోటి కుంకుమార్చన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. దేశ ప్రగతి కోసం ఐక్యంగా పనిచేయాలని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎం. సుభాష్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రోహిత్ కుమార్ సింగ్, వెంకట్ రామ్ చౌదరి, రాజేష్ అగర్వాల్, సుధాకర్ శర్మ, డాక్టర్ అనంత లక్ష్మి, శ్రీదేవి, కరాటే కల్యాణి, రోహిత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.






