రూ.200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్స్
- మహిళా సాధికారికతకు ప్రభుత్వం అండ
- రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి, మే 22 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు లక్ష్యంగా ఒక్కొక్కటి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా పాఠశాలలను నిర్మిస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, మహిళా సాధికారికత, సామాజిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం బలమైన బాసటగా నిలుస్తోందని పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కంది సమీపంలోని ఎల్.ఎన్. కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు అండగా నిలవడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
టిజిఐఐసి చైర్పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఆరు గ్యారంటీలను ప్రజలకు సమర్థవంతంగా అందిస్తోందన్నారు. చెప్పింది చేసి చూపించే ప్రభుత్వంగా ముందుకు సాగుతోందని తెలిపారు. కార్యక్రమంలో కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ చెక్కులను మంత్రి, టి.జి.ఐ.ఐ.సి చైర్పర్సన్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సి.డి.సి చైర్మన్ రామ్రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ చైర్పర్సన్ వనిత, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






