23 May, 2026 | 3:07 AM

విద్యా కమిషన్ చైర్మన్ రాజీనామా

23-05-2026 02:00 AM

సీఎస్‌కు రాజీనామా లేఖ 

బాధ్యతలను విజయవంతగా పూర్తి చేశా : ఆకునూరి మురళి 

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): తెలంగాణ విద్యాకమిషన్ చైర్మన్ పదవికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. శుక్రవారం తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు పంపించారు. ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేశానని లేఖలో పేర్కొన్నారు. విద్యాకమిషన్ చైర్మన్‌గా సేవలందించేందుకు తనకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

పదవీకాలం 4 నెలలు ఉండగానే..

విద్యారంగంలో కీలక మార్పుల కోసం ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 4న విద్యాకమిషన్ చైర్మన్‌గా ఆకునూరి మురళీని, సభ్యులు గా ప్రొ. పీఎల్. విశ్వేశ్వర్‌రావు, డా. చారకొండ వెంకటేశ్, కే. జ్యోత్న్స శివా రెడ్డిని నియమించింది. రెండేళ్ల కాలానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ ఆకునూరి మురళి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.

ముఖ్యంగా ఫిబ్రవరి 28న తన నివేదికలో చేసిన సిఫార్సులపై ఉపాధ్యాయులు, అధ్యాపకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ విషయంపై ప్రభుత్వం కూడా అప్పట్లో సీరియస్ అయినట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వ సలహా దారు కేశవరావుకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.