పంట ప్రణాళిక ఏదీ?
- ఆరేళ్లుగా ప్రకటించని ప్రభుత్వం
- రెండు, మూడు పంటలకే పరిమితమవుతున్న రైతులు
- అధికంగా వరి, పత్తి, మొక్కజొన్నకే ప్రాధాన్యం
- ఏటేటా తగ్గుతున్న పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు
- ఈ వానాకాలమైనా ప్రణాళిక ఖరారు చేసేనా?
హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి) : వ్యవసాయంలో అత్యంత కీలకమైన పంట ప్రణాళిక ప్రకటించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రతీ సీజన్‌లో (వానాకాలం, యాసంగి) రైతులకు మార్గదర్శకంగా ఉండేలా పంటల ప్రణాళిక రూపొందిస్తోంది. మార్కెట్ డిమాండ్, వర్షపాతం, భూగర్భ జలాల లభ్యతను బట్టి రైతులు ఏ పంటలు వేయాలో సూచిస్తుంది.
కానీ, రాష్ట్ర వ్యవసాయ శాఖ గడిచిన ఆరేళ్లుగా పంటల ప్రణాళిక ప్రవేశపెట్టడం లేదు. దీంతో వ్యవసాయ రంగం అనేక రుగ్మతలకు గురవుతోందని, అవగాహన లేమితో రైతులు ఒకటి, రెండు పంటలకే పరిమితం అవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రానున్న ఖరీఫ్ సీజన్‌కు అయినా ప్రణాళిక సిద్ధం చేయాలన్న డిమాండ్ రైతు సంఘాల నుంచి పెరుగుతోంది.
ఆ మూడు పంటల వైపే మొగ్గు
2020 నుంచి ప్రభుత్వం పంటల ప్రణాళిక ప్రకటించకపోవడంతో రైతులు అధికంగా వరి, పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు. 2013-- 14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 65.81 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి కాగా.. 2024- -25 నాటికి ఒక కోటి 70 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. దేశంలో 12 శాతం వరి రాష్ట్రంలోనే పండుతోంది. 19.95 లక్షల ఎకరాల నుంచి 46.9 లక్షల ఎకరాలకు పెరిగింది. సాగునీటి పారుదల మెరుగుపడటం, సమృద్ధిగా వర్షాలు కురువడంతో పాటు ఈ రెండు పంటలకు కల్పిస్తున్న మద్దతు ధరలు.. మరింత ఊతమిచ్చాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుండటం కూడా వరి సాగు పెరగడానికి కారణంగా చెప్పవచ్చు. 2025- 26లో రాష్ట్రం తన అవసరాలు తీర్చుకుని, కేంద్రానికి ఇచ్చింది పోను.. 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిగులు తేలింది. కొంత కాలంగా మక్కజొన్నకు సైతం డిమాండ్ పెరిగింది. సాగు విస్తీర్ణం 6 లక్షల నుంచి 16 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇది గత యాసంగిలోని 9 లక్షల ఎకరాలతో పోలిస్తే దాదాపు రెండింతలైంది.
ప్రమాదంలో ఉద్యాన, పప్పులు, నూనెగింజల సాగు
రిజర్-- -14 నుంచి 2023- -24 మధ్య పండ్ల తోటల విస్తీర్ణం 7.4 లక్షల ఎకరాల నుంచి 3.9 లక్షల ఎకరాలకు, కూరగాయలు 5.4 లక్షల నుంచి 1.2 లక్షల ఎకరాలకు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు 96 వేల ఎకరాల నుంచి 66 వేల ఎకరాలకు పడిపోయాయి. ఉద్యాన పంటలు, పప్పులు, నూనె గింజల సాగు వైపు రైతులను మళ్లించకపోతే భవిష్యత్‌లో ఆయా పంటల సాగు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆర్‌బీఐ తన రిపోర్టులో హెచ్చరించింది.
వరి సాగు విస్తీర్ణంలో కనీసం 2.4 లక్షల ఎకరాలను పండ్లు, దినుసులు, నూనె గింజ సాగుకు మళ్లించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్ర అవసరాల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
ఏకరూప పంటలతో అనేక సమస్యలు
రాష్ట్రంలో వరి, పత్తి కేంద్రంగా వ్యవసాయం జరుగుతుండటం.. ఈ ఏకరూప పంటల విధానం వల్ల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పంటల్లో వైవిద్యం లేకపోవటం అనర్థాలకు కారణమవుతోందని, తద్వారా దిగుబడి తగ్గడమే కాకుండా నేల సారం దెబ్బతింటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వడ్లకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర గత ఏడాది క్వింటాల్ రూ.2,100 ఉండగా, రూ.1,800కే కొనుగోలు చేశారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం పంటల ప్రణాళిక లేకపోవటమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సమగ్ర ప్రణాళిక ఉంటేనే..
సంక్షోభంలో ఉన్న వ్యవసాయం రంగం బయటపడాలంటే సమగ్ర ప్రణాళిక తప్పనిసరి అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతులకు డబ్బు పంచే పథకాలు, రుణమాఫీతో ఈ సమస్య తీరదని, వ్యవసాయం పర్యావరణ హితం కావాలన్నా, కౌలు రైతుల ఇబ్బందులు తీరాలన్నా, ఆదాయం పెరిగి రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడాలన్నా ప్రణాళిక ప్రాథమిక అవసరమంటున్నారు. ఎరువుల కొరత నుంచి బయటపడాలంటే సేంద్రియ వ్యవసాయం అవసరమని, అందుకు ప్రణాళిక అవసరమని, ఈ వానాకాలం నుంచైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.






