23 May, 2026 | 2:40 AM

మిల్లర్ల నెత్తిన పెనాల్టీ కత్తి!

23-05-2026 01:53 AM

నిర్దిష్ట సమయంలోగా బియ్యం సరఫరా చేయకపోతే ప్రభుత్వం కఠిన వైఖరి

25% పెనాల్టీ.. 12% వడ్డీ! 

నాణ్యతలేని ధాన్యం, సన్నరకాల నుంచి 67% రాని బియ్యం, గోదాముల్లో స్థలం లేమి.. 

ప్రభుత్వ బాధ్యతలను మిల్లర్లపై రుద్దుతున్న వైనం

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టుగా ఉంది. తాము నిర్వర్తించాల్సిన బాధ్యతలను సరిగా నిర్వహించకుండా, రాష్ట్రంలోని ప్రైవేటు రైస్ మిల్లర్లపై పడుతుండటంతో.. నిర్దిష్ట సమయంలోగా బియ్యాన్ని అటు ఎఫ్‌సీఐకి, ఇటు సివిల్ సప్లుకి సరఫరా చేయలేక, చివరికి డిఫాల్టర్లుగా మిగులుతున్నామని మిల్లర్లు ఆవేదన చెందుతున్నారు.

ఇలా డిఫాల్టర్లుగా మారకుండా ఉండేందుకు రైస్ మిల్లర్లు పక్కదారిపట్టేలా ప్రభుత్వమే నిబంధనల పేరుతో తమ భవిష్యత్తుతో ఆటలాడుకుంటుందని వారంటున్నారు. పైగా తాము పాటించని నిబంధనలను బూచిగా చూపెడుతూ, 25 శాతం పెనాల్టీని.. దానికి తోడు గా 12 శాతం వడ్డీని కూడా వసూలుచేస్తూ, తమ నడ్డి విరుస్తున్నట్టు రైస్ మిల్లర్లు గగ్గోలు పెడుతున్నారు. దీనితో వీటన్నింటినీ భరించే శక్తి లేక, అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నట్టు మిల్లర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

మూడు అంశాలను పట్టించుకోని ప్రభుత్వం..

ప్రతి సీజన్‌లోనూ ధాన్యం సరఫరా నుంచే రైస్ మిల్లర్లపై ఒత్తిడి మొదలవుతుందని వారంటున్నారు. నిజానికి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని ప్రభుత్వం సరఫరా చేయాలి. ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం బియ్యాన్ని మిల్లర్లు ఇవ్వాలి. బియ్యాన్ని మిల్లర్లు రవాణా చేసేటప్పుడు గోదాముల్లో సరైన స్థలం ఉండాలి.

ఈ మూడు అంశాల్లో ప్రభుత్వ అధికారులు, సివిల్‌సప్లు విభాగాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే.. రైస్ మిల్లర్లు నిర్దేశించిన ప్రమాణాలమేరకు, నిర్దిష్టమైన సమయంలోగా బియ్యాన్ని అప్పగిస్తారు. అయితే ఈ మూడు అంశాలనుకూడా ప్రభుత్వం తరఫున ఎవరూ సక్రమంగా పాటించడం లేదు. దీనితోనే అసలైన తకరారు మొదలవుతుందని రైస్ మిల్లర్లు అంటున్నారు.

* ధాన్యం నాణ్యతతో ఉండటం లేదు. 3 శాతం వరకే ముక్కిన/రంగు మారిన ధాన్యాన్ని ఇవ్వాల్సి ఉండగా.. రాజకీయ ఒత్తిళ్ళ కారణంగా.. ఇది కాస్తా 15శాతం వరకు వెళుతోంది. క్వింటాళు ధాన్యంలో 15 శాతం.. అంతకంటే ఎక్కువగాకూడా ముక్కిన/రంగుమారిన ధాన్యం ఉంటోంది.

* సన్నరకం ధాన్యం నుంచి 10 శాతం బ్రోకెన్ శాతంతో 67 శాతం బియ్యాన్ని ఇవ్వడం అసాధ్యమని మిల్లర్లు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. టెస్ట్ మిల్లింగ్ చేయమంటున్నారు. కానీ ప్రభుత్వం చేయడం లేదు.

* అటు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు గానీ, ఇటు సివిల సప్లు సంస్థకు గానీ బియ్యాన్ని సరఫరా చేసే సమయానికి గోదాములు ఖాళీగా ఉండటం లేదు. దీనితో ఆలస్యం అవుతోంది.

25 శాతం ఫైన్, 12 శాతం వడ్డీ..

ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలకు విరుద్ధంగా పరిస్థితులు ఉండటంతో.. రైతులు సకాలంలో బియ్యాన్ని సరఫరా చేయలేకపోతున్నారు. కొంత సర్దుబాటు చేసి పంపించిన బియ్యాన్నికూడా గోదాముల్లో ఖాళీలేదని వెనక్కి పంపిస్తుండటంతో.. తిరిగి తిరిగి.. మిల్లర్లకే చుట్టుకుంటోంది. నిర్దేశించిన గడవులోగా బియ్యాన్ని సరఫరా చేయకపోవడంతో.. డిఫాల్టర్లుగా మిగిలిపోతున్నారు. పైగా ఇవ్వాల్సిన బియ్యాన్ని 25 శాతం పెనాల్టీతో.. అదనంగా మరో 12 శాతం వడ్డీతో చెల్లించాలని ప్రభుత్వం నిర్దేశించడంతో.. రైస్ మిల్లర్ల పరిస్థితి పెనంమీది నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అవుతోంది. 

ఉదాహరణకు.. 100 క్వింటాళ్ల బియ్యాన్ని నిర్దేశించిన గడువులోగా ఎఫ్‌సీఐకిగానీ, సివిల్ సప్లుకిగానీ సరఫరా చేయకపోతే.. సదరు మిల్లరుపై 25 శాతం పెనాల్టీ విధిస్తున్నారు. అంటే మొత్తం 125 క్వింటాళ్ళ బియ్యం ఇవ్వాలన్నమాట. పైగా దీనికి అదనంగా మరో 12 శాతం వడ్డీ విధిస్తారు.  అసలు సరఫరాచేసే ధాన్యం నాణ్యంగా లేకపోవడం, ఏవిధంగా చూసినా.. 67 శాతం రాని బియ్యాన్ని ఇవ్వాలంటున్న అధికారులు.. ఇవ్వకపోతే 25 శాతం పెనాల్టీ, అదనంగా 12 శాతం వడ్డీతో తమ నడ్డి విరుస్తున్నారని రైస్ మిల్లర్లు వాపోతున్నారు.

సుమారు 400 డిఫాల్ట్ రైస్ మిల్లులు..

ఇలాంటి పరిస్థితుల ప్రభావంతోనే.. రాష్ట్రంలో డిఫాల్టర్ రైస్ మిల్లుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయని రైస్ మిల్లర్ల సంఘం నాయకులు నెత్తినోరు బాదుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 400 వరకు డిఫాల్ట్ అయిన రైస్ మిల్లులు ఉన్నాయని వారంటున్నారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా.. తమ వైపు ఉన్న ఇబ్బందులు, కష్టాలు, సమస్యలను పట్టించుకున్నపాపాన పోలేదంటూ వాపోతున్నారు.

ఈ కష్టాలు, నష్టాలు, పెనాల్టీలు, వడ్డీల బారిన పడకుండా ఉండేందుకు పలువురు మిల్లర్లు అక్రమాలకు తెరతీస్తూ.. పక్కదాని పడుతున్నారని వారంటున్నారు. నిబంధనల బూచి చూపెట్టి.. తమ నుంచి బియ్యాన్ని రాబట్టేందుకు పెనాల్టీలు, వడ్డీలు విధిస్తున్న ప్రభుత్వం.. నాణ్యమైన ధాన్యం సరఫరా, టెస్ట్ మిల్లింగ్ చేసి ఇవ్వాల్సిన బియ్యం శాతం నిర్ధారణ, సకాలంలో గోదాముల్లో ఖాళీ స్థలం ఉంచేలా చూడాల్సిన బాధ్యతలను మాత్రం విస్మరిస్తుందని వారంటున్నారు.

ఈ ధోరణి ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో రైస్ మిల్లర్ల వ్యవస్థ పూర్తిగా కునారిల్లిపోవడమో, లేక ధాన్యం మిల్లింగు చేయకుండా చేతులెత్తేయడమో జరుగుతుందని మిల్లర్లు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి ముందుకురావాలని వారు కోరుతున్నారు. 

రైస్ మిల్లర్ల మెడకు.. 

ఈ మూడు ముఖ్యమైన అంశాల్లో ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించకపోవడంతో.. రైస్ మిల్లర్లు డిఫాల్టర్లుగా మారుతున్నారని మిల్లర్లు వాపోతున్నారు. 15 శాతం ముక్కిన/రంగు మారిన ధాన్యం ఇచ్చి.. 2 శాతం ముక్కిన/రంగు మారిన బియ్యం ఇస్తే తీసుకోవడం లేదు. మరీ ముఖ్యంగా ఎఫ్‌సీఐ అయితే.. 0.5 శాతం ఉన్నా.. ససేమిరా అంటూ వెనక్కి పంపిస్తున్నారు. 3 శాతం నిబంధనను ప్రభుత్వ పాటించడం లేదు.

పైగా 67 శాతం బియ్యం రావంటున్నా.. బలవంతంగా మిల్లర్ల వద్దకు ధాన్యాన్ని పంపిస్తున్నారు. మరి 15 శాతం ముక్కిన/రంగుమారిన ధాన్యంతో 67 శాతం బియ్యాన్ని ఎలా సరఫరా చేయాలంటూ మిల్లర్లు తలలు బాదుకుంటున్నారు. ఇదే సమయంలో వీలైనంత బియ్యాన్ని ఎఫ్‌సీఐకి, సివిల్ సప్లుకి రవాణా చేసినా, గోదాముల్లో కొరత కారణంగా ఆలస్యం అవుతోంది. దీని ప్రభావం రైస్ మిల్లర్లపైనే పడుతోంది.