9 June, 2026 | 5:46 PM

కొలాయిడ్ సిస్టును తొలగించిన మలక్ పేట యశోద వైద్యులు

09-06-2026 04:13 PM

ఆరోగ్యంగా ఇంటికి చేరిన అంకటి విజయ

అత్యాధునిక వైద్యంతో అరుదైన వ్యాధిపై విజయం సాధించిన మలక్ పేట యశోద ఆసుపత్రి

వివరాలు వెల్లడించిన వైద్యులు

తుంగతుర్తి,(విజయక్రాంతి): మెదడులో అత్యంత అరుదుగా కనిపించే కొలాయిడ్ సిస్టు తో బాధపడుతున్న మద్దిరాల మండల పరిధిలోని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన అంకటి విజయ (46) కు మలక్ పేట యశోద ఆసుపత్రి వైద్యులు అత్యాధునిక ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స నిర్వహించి కొత్త జీవితం ప్రసాదించారు. మంగళవారం మండల కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో మలక్ పేట యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బోట్ల, న్యూరో ఫిజీషియన్ డాక్టర్ సూరిశెట్టి భరత్ కుమార్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

మెదడు మధ్య భాగంలో ఏర్పడిన ఈ సిస్టు కారణంగా సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ప్రవాహానికి ఆటంకం ఏర్పడి, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, తల తిరగడం వంటి సమస్యలు తలెత్తినట్లు వైద్యులు తెలిపారు. సదరు మహిళ కొంతకాలంగా తీవ్ర తలనొప్పితో బాధపడుతుండగా వైద్య పరీక్షల్లో మెదడులో కొలాయిడ్ సిస్టు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అనంతరం న్యూరో సర్జరీ నిపుణుల బృందం ఎండోస్కోపిక్ విధానంలో శస్త్రచికిత్స చేసి సిస్టును పూర్తిగా తొలగించినట్లు తెలిపారు.

ఈ ప్రక్రియతో మెదడులోని ద్రవ ప్రవాహం సాధారణ స్థితికి చేరిందని వైద్యులు వెల్లడించారు. కొలాయిడ్ సిస్టులు అరుదుగా కనిపించినప్పటికీ, చికిత్స ఆలస్యమైతే ప్రాణాపాయం కలిగించే అవకాశముంటుందన్నారు. తలనొప్పి, చూపు మందగించడం, జ్ఞాపకశక్తి సమస్యలు, నడకలో అసమతుల్యత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నిపుణులను సంప్రదించాలని సూచించారు.

రోగి ప్రస్తుతం పూర్తిగా కోలుకుని సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లు యశోద ఆసుపత్రి వైద్య బృందం తెలిపారు. యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రపంచ స్థాయిలో న్యూరో మరియు న్యూరో సర్జరీ సేవలను అత్యాధునిక సదుపాయాలతో అందిస్తున్నామని తెలిపారు. క్లిష్టమైన నాడీ సంబంధిత వ్యాధులకు కూడా సురక్షితమైన, సమర్థవంతమైన వైద్యం అందించడంలో తమ ఆసుపత్రి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యశోద దవాఖాన మార్కెటింగ్ అధికారుల వాసు కిరణ్ రెడ్డి, స్వాగత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.