చర్లలో కొమురం భీమ్ విగ్రహావిష్కరణ
ఎమ్మెల్యే డా.తెల్లం వెంకట్రావుకు ఘన స్వాగతం
జల్, జంగిల్, జమీన్' నినాదమే మనందరికీ స్ఫూర్తి. ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు
శాలువాతో సత్కరించి ఆహ్వానించిన మండల అధ్యక్షుడు విజయ నాయుడు
చర్ల,(విజయక్రాంతి): గిరిజన ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకగా నిలిచిన యోధుడు కొమురం భీమ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పిలుపునిచ్చారు. సోమవారం చర్ల మండలం కేశపురం గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన కొమురం భీమ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యేకు చర్ల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయ నాయుడు శాలువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు.
కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పూలమాలలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికి జై కొమురం భీమ్ నినాదాలతో కార్యక్రమ ప్రాంగణం మార్మోగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 'జల్, జంగిల్, జమీన్' నినాదంతో గిరిజనుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు కొమురం భీమ్ అని కొనియాడారు.
ఆయన త్యాగాలను నేటి తరం గుర్తుంచుకోవాలని, భీమ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, కేశపురం గ్రామాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు విజయ నాయుడు మాట్లాడుతూ, కొమురం భీమ్ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన వీరుడి స్ఫూర్తితోనే సమాజంలో మార్పు సాధ్యమని పేర్కొన్నారు.






