నరకప్రాయంగా యాప్రాల్ రోడ్!
అడుగడుగనా గుంతలమయం
మరమ్మతులు చేయాలని స్థానికుల విజ్ఞప్తి
జవహర్ నగర్, జూలై 28 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ పరిధిలోని యా ప్రాల్ నుండి జవహర్ నగర్ కు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహన దారుల తోపాటు పెద్ద వాహన దారులు తరచూ ప్ర మాదానికి లోనవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సికింద్రాబాద్ కు వెళ్లే ముఖ్యమైన రహదారి కావడంతో నిత్యం ఈ రహదారి వెంబడి రద్దీ ఉంటుందని అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రతిరోజు వేలాదిమంది ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని వాహనదారులు, జవహర్ నగర్ యాప్రాల్ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.






