నేపాల్ వరదల్లో పెద్దకాపర్తి గ్రామానికి చెందిన మహిళ గల్లంతు
చిట్యాల, ఆగస్టు 28: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన కందిమల్ల సుహాసిని రెడ్డి(42) నేపాల్లో సంభవించిన వరదల్లో గల్లంతైనట్లు సమాచారం. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సుహాసిని రెడ్డి భర్త నన్నూరి సంజీవరెడ్డి మునుగోడు మండలం గూడుపూరు గ్రామానికి చెందినవారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా కుటుంబం ఆస్ట్రేలియాలో నివాసం ఉంటోంది.
హైదరాబాద్లో గృహప్రవేశ కార్యక్రమం ఉండటంతో సుహాసిని రెడ్డి ఈ నెల 19న భారత్కు వచ్చారు. అనంతరం ఈ నెల 23న విహారయాత్ర కోసం నేపాల్కు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నేపాల్లో పర్యటిస్తున్న సమయంలో వరదల్లో చిక్కుకుని ఆమె గల్లంతైనట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సుహాసిని రెడ్డి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అధికారుల సహకారం కోరుతున్నారు.






