25 June, 2026 | 2:48 AM

ప్రభుత్వం ఉద్యమకారులకు బాసటగా నిలిచేనా?

25-06-2026 01:50 AM
  1. రాష్ట్రం సిద్ధించి 12 ఏళ్లయినా నేటికి దక్కని గుర్తింపు
  2. వారిని గుర్తించేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు హర్షణీయం
  3. కమిటీల పేరుతో కాలయాపన చేస్తే మరో ఉద్యమం తప్పదు అంటున్న ఉద్యమకారులు

అలంపూర్, జూన్ 23: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాల పాటు జరిగిన ఉద్యమంలో వందలాదిమంది ఉద్యమకారులు తమ సమయాన్ని ,శ్రమను, కొందరు తమ ప్రాణాలను సైతం అర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో కీలక పాత్ర పోషించిన ఈ ఉద్యమకారులు నేడు తమ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుతాయా? లేదా? అన్న ప్రశ్నలతో ఎదురుచూస్తున్నారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యమకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్న ఉద్యమకారుల ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయాలు  వెలువడ లేదని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఉద్యమకారులను విస్మరించి భ్రష్టుపట్టిన బీఆర్‌ఎస్

రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన ఉద్యమకారులను బీఆర్‌ఎస్ పార్టీ పూర్తిగా విస్మరించింది. పదేళ్లు అధికారంలో ఉండి ఉద్యమకారుల న్యాయమైన డిమాండును నెరవేర్చలేక గత ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసింది. ఇప్పటికైనా అధికార కాంగ్రెస్ పార్టీ అటువంటి విధాన ధోరణిని ప్రదర్శించకుండా పలు సంఘటనలను దృష్టిలో ఉంచుకొని కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా ఎన్నికల్లో ఇచ్చిన న్యాయమైన డిమాండును నెరవేర్చి ఉద్యమకారుల పట్ల తమ ఉనికిని చాటుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

విజయ సంకల్ప యాత్ర పేరుతో భారీ సభ

ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించేందుకు ఉద్యమకారులను గుర్తించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉన్నత స్థాయి కమిటీనీ ఏర్పాటు చేసింది.ఈ శుభ తరుణంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ అధ్యలు ఓరుకంటి ఆనంద్ విజయ సంకల్పయాత్ర పేరుతో ఆదిలాబాద్ నుంచి అలంపూరు వరకు 33 జిల్లాల ఉద్యమకారులంతా ఏకతాటిపైకి తెచ్చేందుకు 101 కారులతో ఈనెల 29న అల్లంపూర్ పట్టణంలో ఒక సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఉద్యమకారులు తెలిపారు.

గత ప్రభుత్వం మోసం చేసినట్టే ఈ ప్రభుత్వం మోసం చేయకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఉద్యమకారులకు తగిన సముచిత స్థానం కల్పించాలని ఉద్దేశంతో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఉద్యమకారులు పేర్కొన్నారు.

న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి

గత ప్రభుత్వం మోసం చేసినట్టే ఈ ప్రభుత్వం మోసం చేయకూడదని ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇటువంటి హామీలో భాగంగా ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వాలి.. 250 గజాల స్థలం ఇందిరమ్మ ఇల్లు 25 వేల పెన్షన్ ఆర్టీసీ, రైల్వే వంటి పలు ప్రయాణాల్లో పూర్తిగా ఉచితం వంటి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ముఖ్యమంత్రికి ఆలోచించాలని ఆకాంక్షించారు.

- గుమ్మ గోవర్ధన్, తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర ఫోరం  కార్యవర్గ సభ్యులు

ముఖ్యమంత్రి హామీ నెరవేర్చాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన న్యాయమైన డిమాండును నెరవేర్చాలి. ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుండా అణచివేస్తే రాష్ట్ర సాధనలో ఆంధ్ర పాలకులను తరిమికొట్టినట్టు వచ్చే ఎన్నికల్లో 119 స్థానాల్లో ఉద్యమకారులు పోటీ చేసి తరిమికొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా న్యాయబద్ధమైన మా యొక్క హామీని నెరవేర్చాలని విన్నవిస్తున్నాం.

- గార్లపాడు భూషణం, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు