25 June, 2026 | 2:45 AM

అప్పుల ఊబిలో వీధి వ్యాపారులు?

25-06-2026 01:27 AM
  1. ప్రభుత్వ రుణాలు అందక క్రెడిట్ కార్డుల వైపు..
  2. మళ్లీ వడ్డీ వ్యాపారుల వైపు మల్లుతున్న బతుకులు

మధిర, జూన్ 24(విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన క్రెడిట్ కార్డు, స్వనిధి రుణ పథకాలు క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్లో ఉండటంతో వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధిర పట్టణంలో 2200 మంది చిరు వ్యాపారులు వివిధ బ్యాంకుల నుండి ఆర్థిక సహాయం పొందారు. వీరిలో 10,000 మొదటగా 20,000 రెండోసారి 50,000 మూడోసారి బ్యాంకర్స్ వీధి వ్యాపారస్తులకు లోను రూపంలో నగదు అందజేశారు. 

కానీ దాదాపు సంవత్సరం కాలం నుండి ఎటువంటి లోన్లు రాష్ట్ర ప్రభుత్వం వీధి వ్యాపారులకు అందజేయకపోవడం వలన అనేక ఇబ్బందులు గురవుతున్నారు. వీధి వ్యాపారస్తులకు డబ్బులు ఇవ్వకుండా క్రెడిట్ కార్డు అందజేస్తే అనేక నష్టాలు ఉన్నాయని పలువురు వీధి వ్యాపారస్తులు తెలియజేస్తున్నారు.

రోజువారి అవసరాలకు క్రెడిట్ కార్డు ఉపయోగపడదని దానిని చెల్లించడం కోసం సేవింగ్ ఖాతాలో డబ్బులు ఎప్పుడు కట్ అవుతాయో తెలియని పరిస్థితి ఉంటుందని దీని మూలంగా సివిల్ స్కోర్ తగ్గి రానున్న కాలంలో లోన్లు తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుందని అన్నారు. క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే లోన్లు తొలగించి బ్యాంకు ఖాతాలో జమ చేస్తే అవసరాలకు ఎంతో గాను అవసరాలకు ఉపయోగపడతాయని అన్నారు.

చిరు వ్యాపారాల నిర్వహణకు అవసరమైన పెట్టుబడి లేక అనేక మంది వ్యాపారులు మళ్లీ ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సంపాదించిన ఆదాయంలో ఎక్కువ భాగం వడ్డీలకే చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా సులభంగా రుణాలు అందుతాయని ఆశించిన వ్యాపారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల లబ్ధి నిజమైన అర్హులకు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి యుసారించాలని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని వ్యాపారులు కోరుతున్నారు. లేదంటే చిన్న వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారిని వివరణ అడగగా.... వీధి వ్యాపారస్తులకు క్రెడిట్ కార్డు ద్వారా రుణ సదుపాయం అవకాశం ఉందని అన్నారు. మధిర మున్సిపాలిటీలో 28 మంది ఆర్పీలు ఉండగా కొత్తగా 100 మంది వీధి వ్యాపారస్తులకు లోను మంజూరు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు.