18 March, 2026 | 3:37 AM

‘గాంధీ’ కోసం ఇళ్లు కూల్చుతారా?

18-03-2026 01:56 AM

మండలిలో దాసోజు శ్రవణ్

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): గాంధీ అంటే అందరికీ అభిమానమేనని, అయితే విగ్రహం కోసం ప్రజల ఇళ్లు కూల్చుతారా? అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. మంగళవారం శాసనమండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలుపుతూ ఆయన మాట్లాడారు. పునరావాసం చూపకుండా 300 మందికిపైగా పేదల ఇళ్లను కూల్చివేయడం దారుణమన్నారు.

రాహుల్ గాంధీ తెచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే తుంగలో తొక్కుతుందని, బఫర్ జోన్ కేవలం పేదల ఇళ్లకే పరిమితమవుతుందా అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగమంతా అబద్దాలకు నిలువుటద్దంలా ఉందని విమర్శించారు. అయితే   స్పందిస్తూ కాంగ్రెస్ సభ్యులు అద్ధంకి దయాకర్, బల్మూర్ వెం కట్ లేచి అభ్యంతరం వ్యక్తం చేయగా స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

దీంతో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కల్పించుకుని...గత పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా బీఆర్‌ఎస్ ప్రకటించి ఉంటే ఇప్పుడు ఆ చర్చే వచ్చేది కాదని దాసోజు శ్రవణ్‌కు ఉద్దేశిస్తూ చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిపై మాట్లాడుతూ గత పదేళ్లలో చేయని అభివృద్ధి, సంక్షేమం గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని విమర్శించారు.