రేవంత్‌రెడ్డీ.. సిద్దిపేటపై ఎందుకింత కక్ష?
- అభివృద్ధిపై అక్కసు పెట్టుకొని ఇక్కడ ఎట్లా అడుగుపెడతావు
నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా సిద్దిపేటపై ఈర్షాద్వేషాలేనా?
రూ.1,070 కోట్ల నిధులను ఎందుకు రద్దుచేశావు
ముఖ్యమంత్రికి మాజీమంత్రి హరీశ్‌రావు లేఖ
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): సిద్దిపేటపై ఎందుకింత కక్ష రేవంత్ రెడ్డీ.. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా సిద్దిపేటపై మీకు ఈర్షాద్వేషాలేనా అని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్ర శ్నించారు. సిద్దిపేట నియోజకవర్గంలో మీరు రద్దు చేసిన రూ.1,070 కోట్ల నిధులను పునరుద్ధరించి నిలిచిపోయిన అభివృద్ధి కొనసా గించాలని డిమాండ్‌చేశారు.
నెల 22న ముఖ్యమంత్రి సిద్దిపేటకు వస్తున్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు మంగళ వారం బహిరంగ లేఖ రాశారు. మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 27 నెలల తర్వాత అధికారికంగా సిద్దిపేట నియోజకవర్గంలో అడుగుపెడుతున్నందుకు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా స్వాగతిస్తున్నానని, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిద్దిపేట పేరెత్తనిదే రోజు గడిచేది కాదని, సిద్దిపేట అభివృద్ధిపై మీరు ప్రదర్శించిన ఈర్షాద్వేషాలను మా నియోజకవర్గ ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని లేఖలో పేర్కొన్నారు..
ఆనాడు కలలో కూడా సిద్దిపేటను తలచిన మీరు ఈనాడు అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సిద్దిపేట అనే నియోజకవర్గం ఒకటుందనే విషయాన్ని మరచిపోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శంచారు. సిద్దిపేట అభివృద్ధిని విస్మరించడమే గాకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను పూర్తిగా రద్దు చేశారని, నిధులు రద్దు కావడంతో 27 నెలలుగా పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు.
సిద్దిపేట ప్రగతిపై కక్షపూరితంగా వ్యవహరించకుండా వెంటనే మీరు రద్దు చేసిన నిధులను పునరుద్ధరించాలని, అర్ధాంతరంగా ఆగిన పనులు జరిగేలా చర్యలు తీసుకొని మీ గౌరవాన్ని కాపాడుకోవాలని హితవుపలికారు.




