రోహిత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసు
- ఏడు రోజుల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలి
- లేని పక్షంలో క్రమశిక్షణా చర్యలు
- బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్
- తుది నిర్ణయం తెలిపే వరకు పార్టీ కార్యక్రమాలకు, అధికారిక సమావేశాలకు దూరం
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఉండటం పట్ల బీఆర్‌ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. డ్రగ్స్ వినియోగం జరిగినట్టు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీచేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక సమావేశంలో మాదకద్రవ్యాల వినియోగం జరిగిందని, ఆ సమయంలో రోహిత్‌రెడ్డి అక్కడ ఉన్నారనే మీడియా కథనాలను పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఈ మొత్తం పరిణామాలపై 7 రోజుల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పార్టీ ఆదేశించింది.
ఇలాంటి అక్రమ కార్యకలాపాలతో సంబంధం ఉండటం పార్టీ విలువలకు, ప్రతిష్టకు విరుద్ధమని, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నోటీసు జారీచేసినట్టు ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ పేర్కొన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పార్టీ తుది నిర్ణయం తీసుకునే వరకు రోహిత్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలకు, అధికారిక సమావేశాలకు దూరం గా ఉండాలని స్పష్టంచేసింది. గడువులోపు సంతృప్తికరమైన వివరణ ఇవ్వని పక్షంలో ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే పార్టీ రాజ్యాంగం ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసుపై సిట్ ఏర్పాటు చేసిన తరుణంలో సొంత పార్టీ కూడా రోహిత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.




