9 April, 2026 | 2:22 AM

భర్తను హత్య చేసిన భార్య

09-04-2026 12:19 AM

ఘట్‌కేసర్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): మద్యానికి బానిసై నిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్తను ఓ భార్య హత్య చేసిన సంఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసింది.

సీఐ కనకయ్య గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం, నార్లకుంట తండా, కర్కల్ పహాడ్ గ్రామానికి చెందిన జటావత్ నరేందర్(40)కు సోనితో 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఉపాధి కోసం దంపతులు పోచారం డివిజన్ అన్నోజిగూడ లక్ష్మీనర్సింహ కాలనీలో నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటున్నారు. ఇటీవల నరేందర్ మద్యానికి బానిసై పనికి వెళ్లకుండా, మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో తరచూ గొడవపడుతున్నాడని సమాచారం.

ఈ విషయంపై పలుమార్లు కుల పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో భర్తను హత్య చేయాలని పథకం రచించిన సోని, మంగళవారం అర్థరాత్రి నిద్రలో ఉన్న సమయంలో చీరతో గొంతు నులిమి, తలను నేలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలు కావడంతో నరేందర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతన్ని ఘట్కేసర్ ప్రభు త్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి శరీరంపై గాయాలు కనిపించడంతో అనుమానం వ్యక్తం చేసిన తల్లి జటావత్ కమ్లి, భార్య సోని మరియు ఆమె సోదరులు నానావత్ రమేష్, భాస్కర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ తెలిపారు.