13 March, 2026 | 5:35 AM

ఈ-బస్సులు ఎవరివి?

13-03-2026 01:25 AM
  1. ఆర్టీసీలోకి ఇప్పటికే 500 ఎలక్ట్రికల్ బస్సులు 
  2. కేంద్ర ప్రభుత్వ స్కీంలో భాగంగా కార్పొరేట్ సంస్థలకే కొనుగొలు అధికారం 
  3. తామే కొనుగోలు చేస్తున్నట్టు రాష్ట్ర సర్కారు కవరింగ్ 
  4. ఆర్టీసీకి లేని అధికారం 
  5. కొనుగోలు అవకాశం సంస్థకు ఇవ్వాలంటున్న కార్మిక సంఘాలు

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): పర్యావరణహితం, కర్బన ఉద్గారాలను తగ్గిస్తూ.. కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈవీ బస్సుల (ఎలక్ట్రికల్ బస్సులు) పాలసీ తీసుకొచ్చింది. ఇలా ఆర్టీసీలోకి వస్తున్న ఈవీ బస్సులు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎందుకంటే.. అసలు ఈ ఎవరివి అనే ప్రశ్నకు సరైన జవాబు దొరకదు. ఆర్టీసీవా అంటే, కాదు.. రాష్ట్ర ప్రభుత్వానివా అంటే, ప్రభుత్వం ఒక్క పైసాకూడా ఖర్చు చేయడం లేదు.

కేంద్ర ప్రభుత్వానివా అంటే, కార్పొరేట్ సంస్థకు సబ్సిడీ (గ్రాంట్)ని ఇచ్చేసి కేంద్రం చేతులు దులుపుకుంటోంది. కార్పొరేట్ సంస్థలవా అంటే.. మేము అద్దెకు ఇచ్చేశాం అంటున్నాయి. మరి ఈ బస్సులు ఎవరివి?. ఈనెల 13 ఆర్టీసీ జాక్ తరఫున సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. వారి డిమాండ్లలో ఈవీ బస్సుల సమస్యకూడా ఒక ప్రధాన అంశం.

కేంద్రం పాలసీ.. గ్రాంట్..

పర్యావరణ హితం కోసం.. పెట్రోల్, డీజిల్ లాంటి వాటినుంచి ఎలక్ట్రికల్ వైపు మళ్ళాలని కేంద్రం పాలసీ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అత్యధికంగా కర్బన ఉద్గా రాలన వెదజల్లుతున్న బస్సులను ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాలకు పలు సూచనలు, మార్గదర్శకాలను ఇచ్చింది. దీని ప్రకారం ఆయా రాష్ట్రాల పాలకులు దీనిపై చర్యలు తీసుకుంటున్నారు.

అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో సంప్రదాయబద్దంగా నడుస్తున డీజిల్ బస్సుల స్థానంలో మెల్లగా ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడుతున్నది. కేంద్రం రూపొందించిన పాలసీ ప్రకారం.. కార్పొరేట్ సంస్థలకు ఒక్కో బస్సుపై రూ. 36 లక్షల వరకు గ్రాంట్ (సబ్సిడీ)ని కేంద్రం అందిస్తోంది.

అంటే నేరుగా కేంద్రం నుంచి ఈ బస్సులను నిర్మించి, నిర్వహించే కార్పొరేట్ సంస్థలకు ఈ గ్రాంట్ అందుతోంది. సుమారు ఒక్కో బస్సు ధర రూ. 2 కోట్ల వరకు ఉంటుందని, ఇందులో రూ. 36 లక్షలు కేంద్రం గ్రాంట్‌గా విడుదల చేస్తుందని కార్మిక సంఘాల నేతలుకూడా చెపుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం..

కేంద్రం నుంచి వస్తున్న గ్రాంట్ (సబ్సిడీ)తో.. కార్పొరేట్ సంస్థలు ఈ ఎలక్ట్రికల్ బస్సులను తయారుచేసి ఆర్టీసీకి అందిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో పర్యావరణహితంగా తా ము చేపడుతున్న చర్యల్లో భాగంగా.. ఆర్టీసీలో బస్సులను ఎలక్ట్రికల్ బస్సులుగా మా ర్చుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ఒక్కో ఎలక్ట్రికల్ బస్సు నిర్మాణానికి రూ. 2 కోట్ల వరకు అవుతుంద ని కార్పొరేట్ సంస్థలు చెబుతున్నాయి.

ఒక్క బస్సు పైన కూడా.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కపైసాకూడా ఖర్చు పెట్టడం లేదు. కానీ రాష్ట్ర ప్ర భుత్వం గొప్పగా ప్రచారం  చెప్పుకుంటోం ది. ఇప్పటికే సుమారు 500 ఈవీ బస్సులు ఆర్టీసీలోకి వచ్చి చేరాయి. మరికొద్ది నెలల కాలంలో మరో 2,000 వరకు ఈవీ బస్సు లు రానున్నాయి. అంటే ఒక్క పై సాకూడా ఖర్చు పెట్టకుండానే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రచారం చేసుకుంటున్నది.

కార్పొరేట్ సంస్థలు.. 

ప్రస్తుతానికి మన రాష్ట్రంలోకి వచ్చిన.., వస్తున్న ఈవీ బస్సులు రెండు సంస్థలకు చెం దినవి. ఒలెక్ట్రా, జేబీఎం అనే కార్పొరేట్ సం స్థలు ఈ బస్సులను తయారుచేసి ఆర్టీసీకి హైర్ చేస్తున్నాయి. అంటే.., అద్దెకు ఇస్తున్నాయన్నమాట. అయితే ఈ-బస్సులను నిర్వ హించేందుకు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లను వినియోగించుకోకుండా.. ఆయా సంస్థలు నియమించు కుంటున్నవారినే ఉపయోగిస్తున్నాయి.

మహాలక్ష్మి పథకం అమలయ్యే (ఎక్స్‌ప్రెస్) ఈవీ బస్సుల్లో మాత్రం.. కేవలం కండక్టర్లను ఆర్టీసీ నుంచే తీసుకుంటున్నారు. కానీ అవి కొన్ని మాత్రమే ఉంటున్నాయి. అంటే ఈవీ బస్సు ల నిర్వహణ కోసం డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్‌వైజర్లు, అధికారులు, టెక్నీషియన్లను సద రు కార్పొరేట్ కంపెనీలే ఔట్‌సోర్సింగ్ విధా నం ద్వారా నియమించుకుంటోంది. కేంద్రం ఇచ్చే గ్రాంట్‌ను తీసుకుంటూ.. రాష్ట్ర ప్రభు త్వం ఇచ్చే ఆర్డర్ ప్రకారం.. ఈవీ బస్సులను తయారుచేసి కార్పొరేట్ సంస్థలు ఆర్టీసీకి అద్దెకు ఇస్తున్నాయి.

అద్దెలు వసూలు..

ఇలా ఆర్టీసీకి అద్దెకు ఇస్తున్న ఈవీ బస్సులకు ఒక కిలోమీటరుకు ఇంత చొప్పున అద్దె ను ఆర్టీసీ చెల్లిస్తోంది. జేబీఎస్ సంస్థకు చెం దిన ఈవీ బస్సులకు కిలోమీటరుకు రూ. 40.50 పైసల చొప్పున చెల్లిస్తుండగా.. ఒలె క్ట్రా సంస్థకు చెందిన ఈవీ బస్సులకు కిలోమీటరుకు రూ. 60 చొప్పున చెల్లిస్తున్నారు. రెండూ ఈవీ బస్సులే అయినప్పుడు రెండింటికి చెల్లిస్తున్న అద్దెల్లో ఎందుకంత తేడా అనే అనుమానం రావొచ్చు.

సిటీలో తిరిగే ఈవీ బస్సులు 6 గంటల్లో తక్కువ దూరం ప్రయాణిస్తుంటాయి. అందుకే కిలోమీటరుకు రూ. 60 చెల్లిస్తున్నారు. అదే సిటీ బయట (రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో) ప్రయాణించే ఈవీ బస్సులు 6 గంటల్లో సుమారు 250 నుంచి 300 కిలోమీటర్లకుపైగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. అందుకే వాటికి కిలోమీ టరుకు 40 రూపాయల 50 పైసల చొప్పు న చెల్లిస్తున్నారు.

రెండేండ్లలో.. మరో 3 వేలు..

ఇప్పటికే రాష్ట్రంలో 500 ఈవీ బస్సులు నడుస్తున్నాయి. హైదరాబాద్ మహా నగరంతోపాటు.. జిల్లాల్లో ఎంపిక చేసిన డిపోల పరిధిలో కొన్ని ఈవీ బస్సులను నడిపిస్తున్నారు. వచ్చే రెండేండ్లలో ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు 3 వేల ఈవీ బస్సులను నడిపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళుతుంది. మరికొద్ది నెలల కాలంలో 2 వేల ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయి. అయితే కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే గ్రాంట్‌ను ఆర్టీసీకే ఇస్తే ఆర్టీసీ సంస్థ తరఫునే కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, కేంద్రం ఆ దిశగా ఆలోచించడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. ఎందుకంటే.. పైసా ఖర్చు పెట్టకుండా తమకు పూర్తి ప్రచారం వస్తుండటంతో.. ఆ ఆలోచనకూడా చేయడం లేదు. ఆర్టీసీ సం స్థకు ఈవీ బస్సులను కొనుగోలు చేసే అధికారాన్ని అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఇవ్వడం లేదు. దీనితో ప్రైవేటు కార్పొరేట్ సంస్థల హ స్తాల్లోకి ఆర్టీసీ మెల్లమెల్లగా వెళుతుందని, బడా పారిశ్రామికవేత్తల అజమాయిషీ ఆర్టీసీపై మొదలయ్యిందని కార్మిక వర్గాలం టున్నాయి.

మౌలిక వసతుల బాధ్యత ఆర్టీసీదే 

ఇక ప్రస్తుతం ఈవీ బస్సులను కేటాయించిన డిపోల్లో మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత ఆర్టీ సీదే. ఈవీ బస్సుల ఛార్జింగ్ కోసం పవర్ పాయింట్లు, ఛార్జింగ్ పాయిం ట్లు, విద్యుత్తు లైన్లు, షెడ్లు లాంటివి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆర్టీసీదే. ఇందుకోసం ఒక్కో డిపోలో సుమారు రూ.8 నుంచి రూ.12 కోట్ల వరకు ఆర్టీసీ ఖర్చు చేయాల్సి వస్తోందని ఆర్టీసీ కార్మిక వర్గాలు వాపోతున్నాయి. కేంద్రం ఇచ్చిన గ్రాంట్‌తో తయారైన ఈవీ బస్సు లు..

రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ ప్రకా రం.., ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో ఆర్టీసీకి కార్పొరేట్ సంస్థలు అద్దెకు ఇ స్తుండగా.. ఆ బస్సుల నిర్వహణ కోసం, ఛార్జింగ్ కోసం ఆర్టీసీ సంస్థ మాత్రం తమ డిపోలను, స్థలాన్ని కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేస్తున్నా యి. అయితే తమ డిపోలను, మౌలి క వసతులను ఉపయో గించుకు న్నందుకు ఈవీ బస్సుల కార్పొరేట్ కంపెనీలు మాత్రం ఎలాంటి అద్దెను చెల్లించకపోవడం గమనార్హం. మౌలి క వసతులకు సంబంధించి సబ్‌స్టేషన్‌ను ఆర్టీసీ సంస్థ ఏర్పాటు చేస్తుండ గా, ఇన్‌స్టలేషన్ ఖర్చు మాత్రం ప్రైవే టు కార్పొరేట్ సంస్థలు భరిస్తున్నాయి.

అధికారం ఆర్టీసీకి ఇవ్వాలి.. 

కేంద్రం గ్రాంట్‌తో కార్పొరేట్ సంస్థలు తయారుచేసిన ఈవీ బస్సులను.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఆర్టీసీకి అద్దెకు ఇస్తున్నాయి. అయితే ఈ బస్సుల నిర్వహణకు మానవ వనరులనుకూడా ప్రైవేటు సంస్థలే నియమించుకుంటుండటంతో.. ఆర్టీసీ ఉద్యోగులు ఉపాధి ప్రమాదంలో పడుతున్నాయి.  ఒక కొత్త బస్సు ఆర్టీసీకి వస్తే.. సుమారు ఐదు గురికి ఉద్యోగ, ఉపాధి లభిస్తుంది.

కానీ ఈవీ బస్సులతో కొత్తగా ఉపాధి అవకాశాలు పక్కనపెట్టి.. ఇప్పటికే ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల ఉపాధికూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. మేము ఈవీ బస్సులకు వ్యతిరేకం కాదు. పర్యావరణాన్ని కాపాడటానికి మేముకూడా మద్దుత్తు ఇస్తున్నాం. అయితే దానివల్ల మా ఉపాధి దెబ్బతింటోంది. ఆర్టీసీ డిపోలు, స్థలాలు ప్రైవేటు చేతుల్లో పెట్టాల్సి వస్తోంది.

ప్రైవేటు సంస్థలకు కాకుండా.. ఆర్టీసీ సంస్థకే ఈవీ బస్సులను కొనుగోలు చేసే అధికారం ఇవ్వాలి. ప్రభుత్వం అందుకు నిధులను కేటాయించాలి. దీనివల్ల ఉపాధి పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆర్టీసీ అస్తులు సురక్షితంగా ఉంటాయి. ఈనెల13న మేము సమ్మె నోటీసు ఇవ్వనున్నాం. మా డిమాండ్లలో ఈవీ బస్సులుకూడా ఒక ముఖ్యమైన అంశమే.

 మారంరెడ్డి థామస్‌రెడ్డి, ఆర్టీసీ జాక్ వైస్ చైర్మన్, 

ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి