25 April, 2026 | 4:02 AM

పాలమూరుపై పట్టింపేది?

25-04-2026 02:32 AM
  1. పాలమూరు, బడ్జెట్‌లో అరకొర నిధుల కేటాయింపు
  2. ప్రాజెక్టు పూర్తికి రూ.22 వేల కోట్ల ప్రతిపాదనలు ఈసారి కేటాయించింది రూ.1,800 కోట్లే
  3. పూర్తికావడంపై అనుమానాలు మరో రూ.14 వేల కోట్లకు పైగా నిధులు అవసరమని అంచనాలు

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల ఇచ్చిన హైకోర్టు తీర్పు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై సీబీఐ విచారణను వేగవంతం చేయాలని ఒత్తిడి తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో మరి పాలమూరు ప్రాజెక్టు పూర్తిచేయడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధి పాలమూరు ఎత్తిపోతల పథకంపై కనిపించడం లేదనే విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

రాష్ట్రంలో అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టులలో ఒకటైన పాలమూరు ప్రాజెక్టు ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇంకా పూర్తికాకపోవడంపై ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి బడ్జెట్ సమావేశాలకు ముందు పాలమూరు ప్రాజెక్టు పూర్తిచేయడానికి ఇంకా రూ. 22 వేల కోట్ల వరకు అవసరమని సంబంధిత శాఖ ప్రతిపాదించింది. ఈ నిధులు కేటాయిస్తే ప్రాజెక్టు పూర్తిఅవుతుందని అందరూ ఊహించినప్పటికీ బడ్జెట్‌లో మాత్రం అరకొర నిధులే కేటాయించారు. కేవలం రూ.1,800 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న శ్రద్ధ పాలమూరుపై ఎందుకు చూపడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

2015లో రూ.35,250 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. తర్వాత 2023లో దానిని రూ.55,086 కోట్లకు సవరించారు. అయితే ఈ అంచనాలన్నీ 2015- ధరల ఆధారంగా లెక్కలు కావడంతో పెరిగిన నిర్మాణ ఖర్చులు, అదనపు పనులు, భూసేకరణ వ్యయం వంటి కారణాలతో తాజా అంచనాల ప్రకారం మొత్తం వ్యయం రూ. 85 వేల కోట్లకు చేరనుందని నీటిపారుదల శాఖ భావిస్తోంది. ప్రాజెక్టు ప్రారంభించినప్పటి అంచానాలతో పోలిస్తే ప్రస్తుతం ఈ వ్యయం రెండు రెట్లకుపైగా పెరిగింది.

ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుపై రూ.32,067 కోట్లు ఖర్చు చేశారు. ప్రధాన కాలువలు, కొంతమంది రిజర్వాయర్లు, లిఫ్టుల నిర్మాణంలో కొంత పురోగతి ఉన్నప్పటికీ అసలు ప్రాజెక్టుకు కీలకమైన డిస్ట్రిబ్యూటరీలు, సబ్ కెనా ల్‌లు, పిల్ల కాలువలు, అలాగే పూర్తి స్థాయి భూసేకరణ ఇంకా మిగిలే ఉన్నాయి. లిఫ్టుల్లో కూడా సగంవరకు మాత్రమే పంపులు, మో టార్లు అమర్చారు. మిగిలిన భాగం పూర్తి కాకుండా ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం మిగిలిన పనులను పూర్తి చేయాలంటే కనీసం రూ. 22 వేల కోట్లు అవస రమని అధికారవర్గాలు స్పష్టంచేస్తున్నాయి. ఇందులో డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పూర్తిస్థాయి లో నిర్మాణం, సబ్ కెనాల్‌లు, పిల్ల కాలువలతోపాటు సుమారు 33,500 ఎకరాల భూసేకరణ అంశం కీలకంగా మారింది.

అయితే భూసేకరణకే సుమారు రూ. 7 వేల కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. రై తుల డిమాండ్లు, మార్కెట్ ధరల పెరుగుదలతో ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. రూ. 14 వేల కోట్లకుపైగా అవసరం.. ప్రాజెక్టును పూర్తిచేసేందుకు భారీగా ని ధులు అవసరమని చెబుతున్న ప్రభుత్వం ఈ బడ్జెట్లో మాత్రం కేవలం రూ. 1,800 కో ట్లు మాత్రమే కేటాయించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అవసరానికి తగ్గ నిధులు లేకుండా పనులను వేగవంతం చేయడం ఎలా సాధ్యం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నా యి. ప్రస్తుత అంచనాల ప్రకారం ఇంకా కనీ సం రూ. 14,602 కోట్లు అదనంగా వెచ్చిస్తేనే ప్రాజెక్టు పూర్తి అయ్యే అవకాశం ఉంద ని అధికారులు చెబుతున్నారు.

అయితే కాళేశ్వరం నిర్మాణంలోనూ, ఆ తర్వాత పరిణామాలపై ప్రభుత్వాలు చూపిన ప్రత్యేక చొరవ పాలమూరు ప్రాజెక్టుపై ఎందుకు ప్రదర్శించడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రాజెక్టును 21 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టినప్పటికీ, అన్ని ప్యాకేజీల్లో సమానంగా పురోగతి లేదు. ముఖ్యంగా చివరి దశ పనులు అయిన కాలువల నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీలు పూర్తి కాకపోతే 12.3 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యం అసాధ్యంగా మారుతుంది. అంటే ఇప్పటివరకు చేసిన భారీ వ్యయం కూడా పూర్తి ఫలితాలు ఇవ్వకపోయే ప్రమాదం ఉంది. మరోవైపు పనులు ఆలస్యమవుతున్న కొద్దీ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రాధాన్యత, తగిన నిధుల కేటాయింపు చూపించకపోతే ఇది కూడా దీర్ఘకాలికంగా పెండింగ్ ప్రాజెక్టుగా మారే ప్రమాదం ఉంది.