సమన్వయ కమిటీలో సీనియర్లు ఎక్కడ?
కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వానికి ఇప్పటివరకు సఖ్యత లేదా?
హైదరాబాద్, మార్చి17(విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం కోసం పార్టీ సీనియర్లతో కో ఆర్డినేషన్ కమిటీ వేయడం సహజమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా సమన్వయ కమిటీని నియమించా రు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తుంటే.. ఇప్పుడు ఏఐసీసీ.. ప్రభుత్వం, పార్టీ మధ్యన సమన్వయం చేయడాకి కో ఆర్డినేషన్ కమిటీ నియమించడం పార్టీ లో చర్చనీయాంశంగా మారింది.
ఇక్కడ ప్రభుత్వం, పార్టీ మధ్య సరైనవిధంగా సఖ్యత లేకపోవడం తోనే.. కాంగ్రెస్ అధిష్ఠానం కో ఆర్డినేషన్ కమిటిని నియమించారనే వాదన వినిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వివాదస్పదంగా మారడం, దీంతో పార్టీ అధిష్ఠానానికి చికాకుగా మారిన సందర్భాలున్నాయని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. అయితే కొన్ని నిర్ణయాలు ఏకపక్షంగా జరుగుతున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి.
ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేదని కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల నియమించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల్లో కొందరు పూర్తిస్థాయిలో జనంలోకి వెళ్లడం లేదనే విమర్శలు ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడిన వారిని.. అధికారంలోకి వచ్చాక గుర్తింపు ఇవ్వకపోవడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
డీసీసీ అధ్యక్షులలకు 10 రోజుల పాటు నియమించిన శిక్షణ తరగతులను ఐదారుగురు డుమ్మా కొట్టారని, వారికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో సెంట్రల్ యూనివర్సిటీ భూములు, పార్మా కంపెనీల కోసం భూ సేకరణ విషయంలోనూ రైతులు, ప్రభుత్వం మధ్య జరిగిన గొడవ వంటి అంశాలను పలువురు కాంగ్రెస్ నేతలు ముందుకు తెస్తున్నారు.
ఇక నామినేటెడ్ పదవుల విషయంలోనూ ఏకపక్ష నిర్ణయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సర్కార్ వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేని పరిస్థితి నెలకొన్నది. మొదటి విడతలో ఒకేసారి 36 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఆ తర్వాత మరో ఐదారు పోస్టులను భర్తీ చేశారు. ఇక అప్పటి నుంచి నామినేటెడ్ పోస్టులు భర్తీ కాలేదు. పోస్టులు తక్కువగా ఉండటం, ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో వాయిదా పడుకుంటూ వస్తోంది.
ఈ కో ఆర్డినేషన్ కమిటీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ నేత వంశీచందర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయతే ఈ సమన్వయ కమిటీలో మంత్రులతో పాటు కొందరు పార్టీ సీనియర్లకు అవకాశం కల్పిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి ప్రభుత్వం, పార్టీ నిర్ణయాల్లో ఈ నాయకులు కీలకంగానే ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.




