1 June, 2026 | 5:05 AM

తులం బంగారం ఎప్పుడిస్తరు?

01-06-2026 02:14 AM
  1. అలవికాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ 
  2. పథకాల లబ్ధి కోసం ఎదురుచూస్తున్న ప్రజలు 
  3. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పద్మ బాయి నర్సింగరావు

గజ్వేల్, మే 31: ఎన్నికల్లో హామీ ఇచ్చిన కల్యాణ లక్ష్మి తులం బంగారం ఎప్పుడు ఇస్తారని మహిళలు అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పద్మ బాయి నర్సింగరావు అన్నారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ  గజ్వేల్ పట్టణంలో ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా నిర్వహించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన లబ్ధిదారులు అధికారులు ప్రజాప్రతినిధులతో పాటు నాయకులను కల్యాణ లక్ష్మి తులం బంగారం కోసం అడగడం కనిపించిందన్నారు.

కల్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం పంపిణీ చేయకపోవడంతో  లబ్ధిదారులు నిరాశ చెంది హామీల అమలుపై ప్రశ్నలు వేస్తున్నారని, గజ్వేల్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ జరిగినప్పటికీ, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న  ఆడబిడ్డలు ప్రభుత్వం ప్రకటించిన ఇతర హామీలు కూడా అమలవుతాయన్న ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయన్నారు. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి సాయంతో పాటు తులం బంగారం అందుతుందనే అంచనాలు పెట్టుకున్నా, అవి నెరవేరకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.2,500, 18 ఏళ్లు నిండిన యువతులకు స్కూటీలు, ల్యాప్టాప్లు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. గజ్వేల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కేవలం రెండు సార్లు మాత్రమే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసినట్లు పేర్కొంటూ, ఆ ప్రక్రియ కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదని ప్రజలే చెప్పుకుంటున్నారన్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో భాగంగా ఆర్టీసీ సేవలను మరింత విస్తరించకుండా మహిళల మధ్య ఇబ్బందులు సృష్టిస్తున్నారని, 

ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని, మహిళలకు ప్రకటించిన సంక్షేమ పథకాలను త్వరగా అమలు చేయాలని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పద్మ బాయి నర్సింగరావు డిమాండ్ చేశారు.