26 May, 2026 | 1:54 AM

ధాన్యం కొనేదెప్పుడు?

26-05-2026 01:02 AM
  1. రోడ్డెక్కి అన్నదాతల ఆందోళన
  2. అకాల వర్షాలతో నష్టపోతున్నామని ఆవేదన
  3. పలు ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ నాయకుల మద్దతు

మహబూబాబాద్/జగిత్యాల/తంగళ్లపల్లి/నంగునూరు, మే 25 (విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకెప్పుడు కొంటారని ప్రభుత్వాన్ని నిలదీస్తూ సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేసి తరలించాలని డిమాండ్ చేశారు.

మహబూబా బాద్ జిల్లా నెల్లికుదురు మహబూ బాబాద్ రహదారిపై ఆమనగల్లు వద్ద రైతు లు ధాన్యాన్ని దగ్ధం చేసి నిరసన తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రంగరాయ గూడెం ఐకెపి కేంద్రంలో రైతు నరసింహారెడ్డి ధాన్యం బస్తాలకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో వివేకానంద చౌరస్తా వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు.

ధర్నా చేస్తున్న రైతులకు మద్దతుగా నిలిచిన పీఏసీఎస్ చైర్మన్ రమేష్ గౌడ్‌ను మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి నిలదీశారు. ధాన్యం కొనుగోలు చేయా ల్సిన బాధ్యత మీపైనే ఉంటే.. మీరే ధర్నాలు చేయడం ఏంటి? అని ప్రశ్నించగా, ‘అధికారంలో ఉన్నది మీరే కదా.. అంటూ పీఏసీఎ స్ చైర్మన్ తిరిగి ప్రశ్నించారు. రాజగోపాలపేట ఎస్సై వివేక్ చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. 

మక్కలు కొనాలని ధర్నా

మక్క కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రాయికల్-జగిత్యాల ప్రధాన రహదారిపై రైతులు బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ దావా వసంత పాల్గొన్నారు. గంటన్నరకు పైగా కొనసాగిన ధర్నా వల్ల రోడ్డుకిరువైపులా ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచి పోయాయి. ఎస్‌ఐ సుధీర్ రావు, రెవెన్యూ అధికారులు జీవన్ రెడ్డితో మాట్లాడారు.

రోజుకు 5 లారీలు తెప్పిస్తామని ఆర్‌ఐ దేవదాసు, పద్మయ్య హామీ మేరకు ధర్నాను విరమించారు. 15 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్న వారిపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ...అధికారుల నిర్లక్ష్యంతో రైతులు దళారులకు తక్కువ ధరలకు మక్కలు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని  ఆవేదన వ్యక్తం చేశారు. రైతు 40 క్వింటాళ్లు పండిస్తే ప్రభుత్వం కేవలం 25 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తోందని, మిగిలిన ధాన్యాన్ని రైతు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు.

ఈ నెల 31వ తేదీలోపు మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బర్కాం మల్లేష్, పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్ కుమార్, నాయకులు గోపి రాజిరెడ్డి, తురుగ శ్రీధర్ రెడ్డి, కొయ్యడి మహిపాల్, మాజీ ఏఎంసీ చైర్మన్ మారంపల్లి రాణి, సాగర్ పాల్గొన్నారు.