26 May, 2026 | 1:55 AM

అంత్య పుష్కరాల్లో భక్తి తరంగాలు

26-05-2026 12:59 AM

శివ నామ స్మరణతో మారుమోగిన కాళేశ్వరం 

ఆధ్యాత్మిక శోభతో వెలిగిన పుష్కర ఘాట్లు

పుష్కర స్నానం ఆచరించిన శ్రీ యోగానంద సరస్వతి స్వామి

కాళేశ్వరం/మహబూబాబాద్, మే 25 (విజయక్రాంతి): ‘కాళేశ్వర నివాసోవా, కాళేశ్వర నీరిక్షణం, కాళేశ్వరస్య స్మరణం సర్వపాప వినాశనం’ అని స్తుతిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమ తీరాన పవిత్ర సరస్వతి అంత్య పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. అంత్య పుష్కరాల సందర్భంగా 5వ రోజు సోమవారం త్రివేణి సంగమం భక్తులతో కిక్కిరిసింది.

అంతర్వాహిని సరస్వతి నదిలో పుష్కర స్నానమాచరించిన భక్తులు పుణీతులై నీరాజానాలు అర్పించారు. పుష్కర నదికి 12 రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను అనుసరించి భక్తులు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని పురణాలు చెప్తున్నాయి.

సోమ వారం తెలంగాణ, ఏపీ, చత్తీస్ గడ్, ఒడిషా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు కాళేశ్వరం వచ్చారు. శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి (ఆదిలాబాద్) శ్రీ యోగానంద సరస్వతి స్వామీ పుష్కర స్నానం ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆకట్టుకుంటున్న ఉచిత ఎగ్జిబిషన్ 

సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత ఎగ్జిబిషన్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఆటవస్తులు, వినోద కార్యక్రమాలు  విశేషంగా ఆకర్షణీయంగా మారా యి. పుష్కరాలకు విచ్చేస్తున్న కుటుంబాలతో పాటు వచ్చిన చిన్నారులు ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన ఆట వస్తువులతో  ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. కలెక్ట ర్ రాహుల్ శర్మ చిన్నారుల భద్రత, సౌకర్యాల దృష్ట్యా తగిన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.