కాలేజీల్లో కోర్సుల లడాయి!
- ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యా కమిషనరేట్ మధ్య ఆధిపత్య పోరు
- డిగ్రీలోని కొత్త కోర్సులకు యూనివర్సిటీలు అనుమతించాయంటున్న విద్యామండలి
- బీవోఎస్ అనుమతి లేదంటున్న కళాశాల విద్యా కమిషనరేట్
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): ఉన్నత విద్యాశాఖలో డిగ్రీ కొత్త కోర్సుల పంచాయతీ తారాస్థాయికి చేరింది. అటు తెలంగాణ ఉన్నత విద్యామండలి, కళాశాల విద్య కమిషనరేట్ మధ్య ఆధిపత్యపోరు న డుస్తోంది. ఇద్దరు అధికారుల మధ్య నయో ధ్య కుదరకపోవడంతో విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముంది. దీంతో రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో బీబీఏ, బీకాం, బీఎస్సీలో కొత్త కోర్సుల అమలుపై సందిగ్ధత నెలకొంది.
స్వ యంగా ముఖ్యమంత్రి చూస్తున్న విద్యాశాఖలో ఇటువంటి పరిస్థితి ఉండటం తీవ్ర వి మర్శలకు దారితీస్తోంది. ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ఈ ఏడాది కొన్ని కొత్త కోర్సులను ప్రా రంభించాలని ఉన్నత విద్యా మండలి భావించింది. అందులో భాగంగా మార్చిలోనే యూనివర్సిటీ వీసీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పా ల్గొన్న 7 సాంప్రదాయక యూనివర్సిటీల వీసీలు కొత్త కోర్సులను తమ తమ యూనివర్సిటీల పరిధిలో ప్రారంభించడానికి అంగీ కరించారు.
కొత్త కోర్సులకు సంబంధించిన సిలబస్ రూపకల్పన ఇతర అంశాలను ఉన్న త విద్యా మండలి రూపొందించి యూనివర్సిటీలకు చెందిన బీవోఎస్‌లతో సమావేశం ఏర్పాటు చేసి ఆమోదింప చేసుకుంది. ఈ ప్రక్రియ ఏప్రిల్ నెలలో ప్రారంభమై మే 15 నాటికి ముగిసింది. అయితే అప్పటికే దోస్త్-2026 అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమై, మొదటి విడత సీట్లను ఈ నెల 14న కేటాయించారు. మొదటి విడతలో ఏప్రిల్ 30 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించింది.
కాలేజీల్లో యూనివర్సిటీలు తనిఖీలను పూ ర్తి చేయకపోవడంతో ఆయా ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వలేదు. ఈ నెల 14న మొదటి విడత సీట్ల కేటా యింపు పూర్తి కాగా.. నేటితో కాలేజీల్లో చేరడానికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి తుది గడువుగా ఉంది. కొత్తగా కోర్సును ప్రారంభించాలనుకున్న కాలేజీల్లో ఉన్నత విద్యా మండలి, వర్సిటీ అధికారులు సంయుక్తంగా జాయింట్ ఇన్‌స్పెక్షన్ కమిటీ(జేఐసీ) పేరు తో తనిఖీలు పూర్తి చేసిన అనంతరం కాలేజీలకు అనుమతులు ఇచ్చారు.
అనుమతులు ఇచ్చిన తరువాత ఆయా కాలేజీల వివరాలను రిజిస్ట్రార్లు తమ లాగిన్ ఐడీలతో దోస్త్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే యూనివర్సిటీలు నమోదు చేసిన కాలేజీల వివరాలను దోస్త్ వెబ్‌సైట్‌లో విద్యార్థులకు వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి వీలులేకుండా కాలేజీయేట్ కమిషన్ అధికారులు అడ్డుపడ్డారని ఉన్నత విద్యా మండలి ఆరోపిస్తోంది. దోస్త్ కన్వీనర్‌గా ఉన్న వారి ఆదేశాలను అమలు చేయకుండా టెక్నికల్‌గా దోస్త్ చైర్‌పర్సన్‌గా ఉన్న వారు చెపుతున్న వాటిని అమలు చేస్తూ కొత్త కోర్సులకు వెబ్ ఆప్షన్లు లేకుం డా చేస్తున్నారని ఉన్నత విద్యా మండలి ఆరోపిస్తోంది.
అయితే ప్రైవేటు కాలేజీలకు కొత్త కోర్సులకు అనుమతులు ఇవ్వాలంటే వాటికి సంబంధించిన సిలబస్ యూనివర్సిటీల బీవోఎస్‌లో ఆమోదించాలని, అనంతరం యూనివర్సిటీలు అనుమతులు ఇస్తాయని కళాశాల విద్య కమిషనరేట్ వాదన. కొత్త కోర్సులను గతంలో ప్రారంభించినపుడు ఎప్పుడూ ఇటువంటి అభ్యంతరాలను కళాశాల విద్య శాఖ నుంచి రాలేదని, గత ఏడాది లో కూడా బీఎస్సీ డాటా సైన్స్‌ను కొత్తగా ప్రారంభించామని ఉన్నత విద్యా మండలి ప్రశ్నిస్తోంది.
విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలనే ఉద్దేశంతో నిబంధనల మేరకే కొత్త కోర్సుల ప్రక్రియను పూర్తి చేశామని చెబుతోంది. ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. సీఎంను కలిసి వివరించే యోచనలో ఉన్నత విద్యామండలి ఉంది. ఇదిలా ఉంటే కళాశాల కమిషనరేట్ మాత్రం ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కొత్తగా 11 ఏఈడీపీ కోర్సులను ప్రవేశపెట్టింది.






